భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. మరోపక్క కరోనా సోకకుండా అడ్డుకొనేందుకు ఇప్పటికే పలు సంస్థలు తయారుచేసిన వ్యాక్సిన్‌ల క్లినికల్ ట్రయల్స్ జోరుగా సాగుతున్నాయి. భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇది కాక పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా అమెరికాలోని ఆక్స్‌ఫర్డ్ దాని భాగస్వామి ఆస్ట్రాజెనికా తయారు చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. కనుక మరో రెండు మూడు నెలల్లోనే కరోనా వ్యాక్సిన్ సిద్దం కావచ్చు. కానీ దానిని ముందుగా సొంతం చేసుకొనేందుకు అమెరికావంటి కొన్ని దేశాలు ఆయా సంస్థలకు భారీ మొత్తాలు చెల్లించి ముందస్తు ఒప్పందాలు చేసుకొంటున్నాయి. ఒకవేళ భారత్‌లో కరోనా వ్యాక్సిన్ సిద్దమైనా ముందుగా రాజకీయనాయకులు, ధనికులకే లభిస్తుందని కనుక భారత్‌లో 130 కోట్లకు పైగా ఉన్న జనాభాలో సామాన్య ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి చాలా సమయం పట్టవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.
కానీ భారత్‌లో ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం ద్వారానే వ్యాక్సిన్ లభిస్తుందని కనుక ఎవరూ దాని గురించి కంగారు పడవలసిన అవసరం లేదని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదార్ పూనావాలా స్పష్టం చేశారు. ఆయన తన పార్శీ స్నేహితుడితో చాటింగ్ చేస్తున్నప్పుడు ఈవిషయం చెప్పారు. ఒక్క భారత్ జనాభాకే కాదు...ఇతరదేశాలకు కూడా సరిపడేంత వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరా చేయగల సామర్ధ్యం సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఉందని ఆయన తెలిపారు. కనుక సీరం సంస్థ కృషి ఫలిస్తే ఈ ఏడాది చివరిలోగానే భారత్‌లో ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశించవచ్చు. ఇదిగాక భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కోవాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తే 2020లోనే భారత్ కరోనా నుంచి విముక్తి పొందుతుంది.