అరుంధతి సినిమాలో ‘నిన్నోదల బొమ్మాళీ వదలా...’ అంటూ అందరి గుండెల్లో దడ పుట్టించిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఆ తరువాత చాలా సినిమాలలో విలన్ పాత్రలు చేశారు. ఒంటిపై గుప్పెడు కండలేని హీరోలతో చాలాసార్లు చావు దెబ్బలు తిని వారిని మరింత పెద్ద హీరోలుగా చేశాడు. కానీ నిజజీవితంలో మాత్రం వారందరి కంటే అసలు సిసలైన హీరో తానేనని నిరూపించుకొంటున్నాడు సోనూసూద్.
కరోనా... లాక్‌డౌన్ కష్టాలు మొదలైన తరువాత దేశప్రజలను...ముఖ్యంగా పేదలు, వలస కార్మికులు, వివిద రాష్ట్రాలు దేశాలలో చిక్కుకుపోయినవారిని చూసి అతని ‘విలన్ హృదయం’ కరిగిపోయింది. ఆ రోజు నుంచి అంటే సుమారు నాలుగు నెలల నుంచి అతను తన సొంత డబ్బుతో బస్సులు, రైళ్లు, చివరికి విమానాలు ఏర్పాటు చేసి కొన్ని వేలమందిని వారి సొంత ఇళ్లకు చేర్చాడు. ఇంకా చేర్చుతూనే ఉన్నాడు. “అన్నా! నాకిష్టం వచ్చింది...ఆదుకోవా...?” అని ఓ చిన్న ట్వీట్ చేస్తే చాలు సోనూసూద్ చిటికలో వారి కష్టాలన్నిటినీ మాయంచేసేస్తున్నాడు.
ఆ సాయానికి కులం,మతం, ప్రాంతం, బాష వంటి బేధాభావాలు ఏమీ ఉండవు. అడగడడమే ఆలస్యం “నేనున్నాను... ఒక్కరోజు ఓపిక పట్టండి..” అంటూ ఎంత కష్టానైన్న తీర్చేస్తున్నాడు. సోనూసూద్‌ని అందరూ హీరో... సూపర్ మ్యాన్ అంటూ పొగుడుతున్నారు. నిజానికి అవన్నీ చాలా చిన్న ఉపమానాలనే చెప్పాలి. ఎందుకంటే ఎటువంటి కష్టానైనా తీర్చే శక్తి ఒక్క దేవుడికి మాత్రమే ఉంటుంది. దేవుడు చేయవలసిన పనులను ఇప్పుడు సోనూసూద్ చేస్తున్నాడు కనుక అతను భారత్ ప్రజలను ఆదుకోవడం కోసమే దిగివచ్చిన దేవుడే అనుకోకతప్పదు. నిజానికి దేవుడైనా ప్రార్ధిస్తేనే పలుకుతాడు నోరు తెరిచి అడిగితేనే వరాలు ఇస్తాడు. కానీ సోనూ సూద్ అలా కాదు... అడగకపోయిన కష్టాలు తెలుసుకొని సాయం చేస్తుంటాడు.
ఉదాహరణకి మొన్న చిత్తూరు జిల్లా మదనపల్లిలో నాగేశ్వరరావు అనే నిరుపేదరైతుకు ఎద్దులు లేకపోవడంతో ఆయన ఇద్దరి కూతుళ్ళు ఆ ఎద్దుల స్థానంలో కాడి భుజానికెత్తుకొని పొలం దున్నారు. ఈ విషయం కళ్ళకు కనబడే దేవుడు సోనూసూద్ చెవిలో పడింది. అంతే...మరుసటిరోజుకల్లా ఓ కొత్త ట్రాక్టర్ కొని వారికి బహుమానంగా అందించాడు.
ముంబాయిలోని ఓ చిన్నారి “సోనూ అంకుల్ మారేకులు షెడ్ కారిపోతోంది. ఇంట్లో కూర్చోవడానికి కూడా ఖాళీ లేకుండా ఇల్లంతా నీళ్ళు నిండిపోయాయి. మాకు సాయం చేయవా అంకుల్?” అని అడిగింది. అంతే... బొమ్మాళి కరిగిపోయాడు. “పాప రేపటి నుంచి మీ ఇంట్లోకి ఒక్క చుక్క నీరు కారదు... పక్కా,” అని వరం ఇచ్చేసి మార్నాటికల్లా ఆ ఇంటిపై కొత్త రేకులు వేయించేశాడు.
“అన్నయ్యా.. ఫిలిపిన్స్ దేశంలో చిక్కుకుపోయాం...వెనక్కు రావడానికి సాయం చేయవా?” ఓ చెల్లి ప్రార్ధన.
“చెల్లీ... భయపడకు... ఫిలిపిన్స్ మనకు ఎంతో దూరంలో లేదు. ప్లేన్ పంపిస్తున్నా అందరూ క్షేమంగా వచ్చేయండి...” సోనూ సూద్ జవాబు.
ఇలా ఒకటా... రెండా ట్విట్టర్ నిండా రోజూ వందల కొద్దీ విజ్ఞప్తులు...మరో ఆలోచన లేకుండా అందరికీ సోనూసూద్ అభయహస్తం... వెంటనే “మీ సహాయానికి కృతజ్ఞతలు...”అంటూ ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇంస్టాగ్రామ్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కడ చూసినా సోనూసూద్ సహాయం పొందినవారి మెసేజులే...కృతజ్ఞతలే...అతని గొప్ప మనసు…మానవతావాదాన్ని పొగుడుతూ కవితలు, పద్యాలు, బొమ్మలు, కార్టూన్లు... ఒకటా రెండా... వేలకువేలు. ఓసారి ట్విట్టర్లో తొంగిచూస్తే సోనూసూద్ గురించి తెలుస్తుంది.
అడిగినవారికి అడగనివారికి కూడా ఇంతగా సహాయం చేస్తున్న సోనూసూద్ గురించి రవి నాయర్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో ఓ అద్భుతమైన వ్యాఖ్య చేశాడు.
“సోనూసూద్ వలస కార్మికుల కోసం వాహనాలు ఏర్పాటు చేస్తున్నాడు.
సోనూసూద్ నిరుపేదల కోసం నిత్యావసర సరుకులు ఇస్తున్నాడు.
సోనూసూద్ నిరుద్యోగులకు ఉద్యోగాలు చూపిస్తున్నాడు.
సోనూసూద్ పేదరైతులను ఆదుకొంటున్నాడు.
కనుక సోనూసూద్‌కే మనం పన్నులు చెల్లిద్దామా?” అని ట్వీట్ చేశాడు.
ఒక ప్రభుత్వం చేయవలసిన ఈ పనులన్నిటినీ సోనూసూద్ ఒక్కడే ఒంటి చేత్తో చేసి చూపిస్తున్నాడు కనుక అతనే ఓ ప్రభుత్వంతో సమానమని చెప్పినట్లు భావించవచ్చు. దేవుడు తప్ప మరెవరూ ఇంతగా స్పందించలేరు.. చేయలేరు. కనుక సోనూసూద్ దేవుడే అనుకోవాలి.
సినిమాలలో విలన్ వేషాలు వేసుకొనే సోనూసూద్ సాటిభారతీయులకు ఇంతగా సేవలు చేస్తున్నప్పుడు కోట్లాది రూపాయలు పారితోషికం తీసుకొనే మన పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, బడా పారిశ్రామికవేత్తలు...రాజకీయ నాయకులు...కోటీశ్వరులు ఇంకెంత చేయాలి? ఒక వ్యక్తి ఇంతగా చేయగలిగినప్పుడు డబ్బు, అధికారం, యంత్రాంగం అన్ని ఉన్న ప్రభుత్వాలు ఇంకెంత చేయాలి?
సోనూసూద్‌ని మెచ్చుకోనవసరం లేదు... ఈర్ష్య చెందనక్కరలేదు. అతనిని స్ఫూర్తితో కష్టాలలో ఉన్న సాటి భారతీయులను ఆదుకొంటే చాలు.