అమెరికాలో చైనా దౌత్యకార్యాలయం క్లోజ్!

July 23, 2020


img

అమెరికాలో ఇప్పటి వరకు సుమారు 40 లక్షల మంది కరోనా బారినపడ్డారు. వారిలో సుమారు లక్షన్నర మంది చనిపోయారు. నేటికీ ప్రతీరోజు 50-60,000 మంది కరోనాబారిన పడుతూనే ఉన్నారు. వందల సంఖ్యలో చనిపోతూనే ఉన్నారు. ఈ కష్టాలు చాలావన్నట్లు కరోనా...లాక్‌డౌన్‌ కారణంగా లక్షలాదిమంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయి సాయం కోసం ప్రభుత్వంపై ఆధారపడ్డారు. కరోనా మహమ్మారి అమెరికా ఆర్ధికవ్యవస్థను చిదిమేస్తోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో డోనాల్డ్ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికలను ఎదుర్కోవలసి రావడం అగ్నిపరీక్షగా మారింది. కనుక ఈ సమస్యలన్నిటికీ కారణమైన చైనాపై డోనాల్డ్ ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అమెరికాలో కరోనా వ్యాక్సిన్ తయారీకి సంబందించి సమాచారం తస్కరించేందుకు చైనా హ్యాకర్స్ ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపధ్యంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ చైనాపై మరోసారి విరుచుకుపడ్డారు. ‘చైనా వైరస్’ అమెరికాతో సహా యావత్ ప్రపంచదేశాలకు తీరని నష్టం కలిగిస్తోందని ట్రంప్‌ ఆవేదన వ్యక్తం చేశారు. హ్యూస్టన్ నగరంలో చైనా దౌత్యకార్యాలయాన్ని తక్షణం మూసివేయాలని ఆదేశించారు. అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాను అన్ని విధాలా దెబ్బతీసి ఆ స్థానాన్ని ఆక్రమించేందుకే చైనా కరోనా వైరస్‌ను సృష్టించి అమెరికాకు అంటగట్టి ఉండవచ్చని ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచదేశాలను కరోనా కబళిస్తుంటే చైనా రాజ్యవిస్తరణ కాంక్ష ప్రదర్శిస్తూ దక్షిణ చైనా సముద్ర జలాలలో ఘర్షణ వాతావరణం సృష్టిస్తోందని, చైనా గుత్తాధిపత్యం చలాయించాలని చూస్తే చేతులు ముడుచుకొని కూర్చోబోమని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చైనాను ఘాటుగా హెచ్చరించారు.


Related Post