తెలంగాణలో కరోనా రోగులకు హోం ఐసోలేషన్ కిట్లు పంపిణీ

July 11, 2020


img

ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో వేల సంఖ్యలో కరోనా రోగులు ఇళ్ళలోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 10,000 మంది ఈవిధంగా చికిత్స పొందుతున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో ఉన్న వారందరికీ అవసరమైన మందులు, శానిటైజర్లు వగైరాలతో కూడిన హోం ఐసోలేషన్ కిట్లను పంపిణీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆ కిట్లు సిద్దంగా ఉన్నాయి. నేటి నుంచి వాటి పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది. ఒక్కో కిట్‌లో పారసిటమాల్, హైడ్రాక్సీక్లోరిక్విన్, యాంటీబయటిక్, విటమిన్ సి,ఈ,డి3, ఎసిడిటినీ తగ్గించే మాత్రలు, లివోసెటిరిజైన్ లతో పాటు గ్లౌజులు, మాస్కూలు, ఒక శానిటైజర్ బాటిల్, కరోనా సోకినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?ఏ మందులు ఎప్పుడు వేసుకోవాలి? అవసరమైతే ఏ నెంబరుకు కాల్ చేయాలి? వంటి పూర్తివివరాలతో కూడిన ఒక చిన్న పుస్తకం ఆ కిట్‌లో ఉంటాయి. 

ఇంట్లో ఉండి చికిత్స తీసుకొంటున్నవారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్య ఆరోగ్యసిబ్బంది రోజూ ఫోన్‌ చేసి తెలుసుకొని అవసరమైన సలహాలు సూచనలు ఇస్తుంటారు. దీని కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికే కోవిడ్ కాల్ సెంటరును ఏర్పాటు చేసింది. కరోనా రోగులు 1800 5994455 టోల్‌-ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేసి అవసరమైన సలహాలు, సహాయం పొందవచ్చు.  


మంత్రి ఈటల రాజేందర్‌ కూడా ఇప్పుడు ట్విట్టర్‌లో @Eetala_Rajender అనే హ్యాండిల్ ద్వారా కరోనా రోగులకు అందుబాటులో ఉంటున్నారు. రాష్ట్రంలో కరోనా రోగులలో ఎవరికైనా వైద్య సహాయం అవసరమైనట్లయితే ఆ ట్విట్టర్‌ హ్యాండిల్ ద్వారా మంత్రి ఈటల రాజేందర్‌ను నేరుగా సహాయం కోరవచ్చు.


Related Post