తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌ను అవమానించింది: ఉత్తమ్‌

July 07, 2020


img

 పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ మూడనమ్మకాల కోసం సచివాలయాన్ని కూల్చివేయడం చాలా దారుణం. ఒకవైపు కరోనాతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతుంటే, ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి డబ్బులు లేవన్న సిఎం కేసీఆర్‌ కేసీఆర్‌, ఇప్పుడు కోట్లు ఖర్చు చేసి సచివాలయాన్ని హడావుడిగా కూల్చడం ఎందుకు? మళ్ళీ వందల కోట్లు ఖర్చు చేసి కొత్త సచివాలయం నిర్మించడం ఎందుకు?

విద్యుత్, మంచినీళ్లు వంటి సౌకర్యాలు ఉన్న సచివాలయాన్ని కరోనా ఆసుపత్రిగా ఉపయోగించుకొంటే ప్రజలకు ఎంతో ఉపయోగపడేది కదా? కానీ ఒకే ఒక మనిషి మూడనమ్మకం కోసం ఉన్న దానిని కూల్చుకొని కొత్తది కట్టుకోవాలనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. విలువైన ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసుకొని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుండటం చూస్తే రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందనిపిస్తుంది.

ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై రాజకీయ కక్షసాధింపులు మొదలైపోతాయి. నా ఇంటి ముందు పోలీసులను మోహరించి కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎవరూ నాదగ్గరకి రాకుండా ఎందుకు అడ్డుకొంటున్నారు?ప్రతిపక్షాలంటే సిఎం కేసీఆర్‌కు ఎలాగూ గౌరవం లేదు. కనీసం గవర్నర్‌నైనా గౌరవించాలి కదా? కానీ గవర్నర్‌ పిలిస్తే ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి శాంతికుమారి వెళ్లకుండా గవర్నర్‌ను అవమానించారు. గవర్నర్‌ను గౌరవించని సోమేష్ కుమార్‌ ఆ పదవికి అనర్హుడు,” అని అన్నారు.


Related Post