ప్రజలు బలవంతుల చేతిలో బందీలుగా మారారు: వీకే సింగ్‌

June 26, 2020


img

తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ప్రభుత్వంపై అసంతృప్తితో తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ఇటువంటి కారణంతో రాజీనామా చేయడం చాలా ఆశ్చర్యకరమైన విషయమే కనుక దానిపై మీడియాలో చర్చలు, ఊహాగానాలు సాగుతున్నాయి. 

వీకే సింగ్‌ వాటిపై స్పందిస్తూ, “నేను రాజకీయాలలో చేరుతానంటూ మీడియాలో వస్తున్న ఊహాగానాలను ఖండిస్తున్నాను. నేను ప్రజలలో చైతన్యం తీసుకురావాలని కోరుకొంటున్నానంటే దానార్ధం రాజకీయాలలో చేరుతానని కాదు. ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు తేవాలని ప్రయత్నిస్తాను అంతే. మన రాజకీయ వ్యవస్థలు ఓటు హక్కు కలిగిన ప్రజల చేతిలోనే ఉన్నప్పటికీ ప్రజలు వాటి చేతిలోనే బందీలుగా మారిపోవడం చాలా దురదృష్టకరం. కొందరు బలవంతుల చేతిలో బందీలుగా మారిపోయిన ప్రజలు వారినే ఎన్నుకోక తప్పనిసరి పరిస్థితిలో ఉన్నారని నేను భావిస్తున్నాను. ప్రజలలో ఈ ధోరణి మారాలని నేను కోరుకొంటున్నాను. స్వామి వివేకానంద, మహాత్మాగాంధీజీ, అన్నా హజారే వంటివారు ప్రజలు చైతన్యవంతులై ఉండాలని కోరుకొన్నారు. పదవీ విరమణ తరువాత నేను కూడా వారి అడుగుజాడలలోనే నడుస్తూ ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు నా వంతు కృషి నేను చేస్తాను. దేశంలో ఏ రాజకీయ నేతలు ఏ రాష్ట్రాన్ని బంగారంగా మార్చలేరు. కేవలం సుపరిపాలనతోనే ఏ రాష్ట్రంలోనైనా...వ్యవస్థలోనైనా మార్పు వస్తుంది. తెలంగాణ పోలీస్ అకాడమీ అందుకు చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది,” అని అన్నారు.    

సాధారణంగా పోలీస్ శాఖలో పనిచేసేవారికి మన రాజకీయ వ్యవస్థలపై ఎటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటి గురించి బహిరంగంగా మాట్లాడేందుకు ఇష్టపడరు. ముఖ్యంగా ఇటువంటి అంశాలపై అసలే మాట్లాడరు. ఒకవేళ వీకే సింగ్‌లాగ ఎవరైనా ధైర్యం చేసి వర్తమాన రాజకీయాల గురించి మాట్లాడితే అది ప్రభుత్వ ధిక్కారంగా పరిగణించబడటం సర్వసాధారణమైన విషయం. కనుక ఎవరూ మాట్లాడేందుకు ఇష్టపడరు. కానీ పోలీస్ శాఖలో ఒక ఉన్నతాధికారిగా పనిచేస్తున్న వీకే సింగ్‌ వర్తమాన రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు కనుక అది సంచలనమైన విషయమే అవుతుంది. 

వర్తమాన రాజకీయాలపై ఆయన అభిప్రాయాలు సహేతుకంగా ఉన్నప్పటికీ, ఆయన డిజిపి పదవి ఆశించి అది లభించక అసంతృప్తితో రాజీనామా చేస్తుండటం నిజమైతే ఆ కారణంగానే ఆయన ఈవిధంగా అసహనం వ్యక్తం చేస్తున్నారనుకోవలసి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులలో ప్రజల ఆలోచనా ధోరణిని ఏదో తాత్కాలికంగా కొన్ని రోజులకు మార్చవచ్చునేమో కానీ మన రాజకీయ వ్యవస్థలను ప్రక్షాళనం చేసేంతగా ప్రజలను మార్చడం అసంభవమేనని చెప్పవచ్చు. మన రాజకీయ పార్టీలు కూడా ఈవిషయం బాగానే పసిగట్టాయి. అందుకే ఎన్నికలకు ముందు ప్రజలను ఏదోవిధంగా ప్రభావితం చేసి తమకు అనుకూలంగా మలుచుకొంటుంటాయి. అన్నా హజారే వంటి పోరాటయోధులు సైతం ప్రజలను చైతన్యపరిచి మన రాజకీయవ్యవస్థలను మార్చాలని చాలా ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు. కనుక వీకే సింగ్‌ ప్రయత్నాలు ఫలిస్తాయనుకోవడం అత్యశే అవుతుంది. 


Related Post