హైదరాబాద్‌ మెట్రోకు మోక్షం ఎప్పుడో?

June 24, 2020


img

దేశవ్యాప్తంగా కేంద్రం లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించింది కానీ నేటికీ కరోనా భయంతో పూర్తి స్థాయిలో రైళ్ళు నడిపించడం లేదు. అలాగే ఎంఎంటిఎస్, మెట్రో రైళ్ళను కూడా అనుమతించలేదు. అన్ని దేశాలలో కరోనా విలయతాండవం చేస్తోంది కనుక ఇప్పట్లో అంతర్జాతీయ విమానసేవలను ప్రారంభించే అవకాశం కనబడటం లేదు. 

లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చినప్పటికీ తెలంగాణతో సహా చాలా రాష్ట్రాలలో కరోనా భయంతో నేటికీ సిటీ బస్సులను నడిపించడం లేదు. కరోనా ఇంకా వ్యాపించకుండా ఈ జాగ్రత్తలు చాలా అవసరమే అయితే తెలంగాణతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలలో మళ్ళీ భారీగా కరోనా కేసులు పెరిగిపోతుంటే, ఎంఎంటిఎస్, మెట్రో రైళ్ళు, సిటీ బస్సులు ఎప్పటికైనా నడిపించగలరా? లేకపోతే వాటి పరిస్థితి ఏమిటి? వాటిలో పనిచేస్తున్న వేలాదిమంది ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? అంతవరకు వాటి నిర్వహణ ఖర్చులు, ఉద్యోగులు, అధికారులు ఏమి చేస్తారు? వారి జీతాలు ఎవరు చెల్లిస్తారు? అనే సందేహాలు కలుగుతున్నాయి. 

ముఖ్యంగా సుమారు రూ.16,000 కోట్లు పైగా పెట్టుబడితో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన హైదరాబాద్‌ మెట్రో రైల్‌ పరిస్థితి ఏమిటి? అనే సందేహం కలుగుతుంది. ఇప్పటికే సుమారు మూడు నెలలుగా మెట్రో రైళ్ళు నిలిచిపోయాయి. దాంతో అప్పటి వరకు  మంచి లాభాలలో నడుస్తున్న హైదరాబాద్‌ మెట్రో అకస్మాత్తుగా నష్టాలలో కూరుకుపోతోంది. హైదరాబాద్‌లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటంతో మెట్రో రైళ్లు ఇంకా ఎన్ని రోజులు నిలుపుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. అంతవరకు మెట్రో సిబ్బంది జీతాలు, స్టేషన్లు, మెట్రో రైళ్ళ నిర్వహణకు చాలా భారీగా ఖర్చవుతుంటుంది. ఆదాయం లేకుండా ఖర్చులు భరించవలసి వస్తే ఎంత పెద్ద సంస్థ అయినా నష్టాలలో మునిగిపోక తప్పదు. అందుకు హైదరాబాద్‌ మెట్రో ఏమీ అతీతం కాదని అందరికీ తెలుసు. 


ప్రస్తుత పరిస్థితులలో హైదరాబాద్‌ నగరంలో సిటీ బస్సులు నడపడం దాదాపు అసంభవంగానే కనిపిస్తోంది. కానీ అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉన్న హైదరాబాద్‌ మెట్రోలో అన్ని జాగ్రత్తలు తీసుకొంటే మెట్రో రైళ్లను నడిపించడం సాధ్యమేనని చెప్పవచ్చు. కనీసం ఇప్పటికైనా మెట్రో రైళ్ళను నడిపించుకోలేకపోతే హైదరాబాద్‌ మెట్రో కూడా టిఎస్ ఆర్టీసీలాగే ప్రభుత్వానికి మరో గుదిబండగా మారే ప్రమాదం ఉంటుంది. ఆ దశకు చేరుకొన్న తరువాత మెట్రోను కాపాడటం ఎవరితరం కాకపోవచ్చు. కనుక రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైళ్ళ పునరుద్దరణ గురించి ఆలోచిస్తే బాగుంటుంది.


Related Post