పీవికి భారతరత్న ఇవ్వాలి: సిఎం కేసీఆర్‌

June 24, 2020


img

దేశం తీవ్ర ఆర్ధిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకొన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవి నరసింహారావు, అతి తక్కువ సమయంలోనే ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించడమే కాకుండా అప్పటి ఆర్ధికమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో కలిసి భారత్‌ ఆర్ధికవ్యవస్థను మళ్ళీ పరుగులు పెట్టించారు. రాజకీయాలలో అపర చాణక్యుడని పీవీ పేరు పొందారు. దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి మేధావి అయితే ఆశ్చర్యం లేదు కానీ ఒక గొప్ప రచయిత, బహుబాషావేత్త కూడా కావడం చాలా గొప్ప విషయమే. ఆయన ఆకస్మిక మరణం తరువాత కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిన తీరుని చూసినవారు ఆయన గొప్పదనాన్ని ఆ పార్టీ గుర్తించలేదనే చెపుతుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ కుటుంబానికి చెందినవారికి వారికి మాత్రమే గుర్తింపు, గౌరవం లభిస్తుంది. పీవి బయటి వ్యక్తి కనుక ఆయనకు సముచిత గౌరవం ఇవ్వలేదనే వాదన వినిపిస్తుంటుంది. పీవీ గొప్పదనాన్ని కాంగ్రెస్‌ పార్టీ గుర్తించకపోయినా అంత అత్యున్నత స్థాయికి చేరుకొని దేశాన్ని క్లిష్ట పరిస్థితుల నుంచి కాపాడి అభివృద్ధిపదంలో నడిపించిన తెలంగాణకు చెందిన పీవీని రాష్ట్ర ప్రజలు ఎన్నడూ మరిచిపోరు.

ఈ నెల 28న పీవీ శతజయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పీవీ జ్ఞానభూమిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. దానిలో తాను కూడా పాల్గొంటానని సిఎం కేసీఆర్‌ చెప్పారు. పీవీ గొప్పదనం రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసేందుకు ఈ ఏడాదంతా రాష్ట్రవ్యాప్తంగా పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతగా రూ.10 కోట్లు విడుదల చేసింది. ఏడాది పొడవునా నిర్వహించబోయే ఉత్సవాల నిర్వహణకు అవసరమైనంత సొమ్మును విడుదల చేస్తామని సిఎం కేసీఆర్‌ చెప్పారు. పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై మంగళవారం ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “దివంగత ప్రధాని పీవీ నరసింహారావు దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు. ఆయన భారతరత్న పురస్కారానికి అన్నివిధాలా అర్హులు. కనుక పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి పంపిస్తాము. తరువాత వీలువెంబడి నేను ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని కలిసిపీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని కోరుతాను,” అని చెప్పారు.


Related Post