చైనాను గట్టిగా ఎదుర్కోవలసిందే: సిఎం కేసీఆర్‌

June 20, 2020


img

ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం అఖిలపక్ష నేతలతో వీడియా కాన్ఫరెన్సింగ్ ద్వారా సరిహద్దులో భారత్‌-చైనా ఘర్షణలు, చైనాతో అనుసరించవలసిన విధానం గురించి చర్చించారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీకి చక్కటి సూచనలు, సలహాలు ఇచ్చారు. 

భారత్‌ ఎప్పుడూ శాంతినే కోరుకొంటుంది కానీ మన భూభాగంలోకి జొరబడి ఆక్రమణలకు పాల్పడుతూ, మన సైనికులను పొట్టన పెట్టుకొన్న చైనాను గట్టిగా ఎదుర్కోకక తప్పదు. ఇటువంటి సందర్భాలలో రాజనీతి కాదు రణనీతి అమలుచేయాలి. 

చైనా, పాకిస్థాన్‌లు ఎప్పుడూ భారత్‌కు సవాలు విసురుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చైనాను ఎదుర్కోవడానికి కేంద్రం స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలను అమలుచేయాలి. మిత్రదేశాలతో బందం మరింత దృడపరుచుకొని చైనాను నిలువరించే ప్రయత్నం చేయాలి. 

చైనా, పాకిస్థాన్‌లను ఎదుర్కొనే విషయంలో టిఆర్ఎస్‌, తెలంగాణ ప్రభుత్వం తరపున కేంద్రానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. దేశంలో అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీలు కూడా రాజకీయాలకు అతీతంగా కేంద్రానికి అండగా నిలబడాలి. 

కశ్మీర్‌లో సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం తీసుకొంటున్న చర్యలు, అనుసరిస్తున్న విధానాలు చక్కగా ఉన్నాయి. సత్ఫలితాలు ఇస్తుండటం సంతోషకరం. 

కరోనాతో తీరని అపఖ్యాతి మూటగట్టుకొన్న చైనా దాని నుంచి ప్రపంచదేశాల దృష్టి మళ్లించడానికే ఇటువంటి నాటకాలు ఆడుతోంది. అయితే చైనా కుయుక్తులను, దాని సామ్రాజ్య విస్తరణ కాంక్షను అన్ని దేశాలు గుర్తించాయి. అందుకే చైనా నుంచి పలుదేశాలకు చెందిన కంపెనీలు అక్కడి నుంచి తరలివెళ్లిపోతున్నాయి. భారత్‌లో సుస్థిరమైన పాలన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ మెరుగు పడటం వంటి కారణాల చేత అవిప్పుడు భారత్‌ వైపు చూస్తున్నాయి. కనుక ఈ సదవకాశాన్ని వినియోగించుకొని వాటన్నిటినీ భారత్‌లోకి ఆకర్శించేందుకు కేంద్రం గట్టి ప్రయత్నాలు చేయాలి.   

ఇప్పటికిప్పుడు చైనా వస్తువులను నిషేదిస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. కనుక ఆయా ఉత్పత్తులను దేశీయంగా తయారుచేసుకొనేందుకు పరిశ్రమలను ప్రోత్సహించి క్రమంగా చైనా ఉత్పత్తులను తగ్గించుకోవడం మంచిది. భారత్‌ స్వయంసంవృద్ధి సాధించి తన కాళ్లపై తాను నిలబడాలని గట్టిగా ప్రయత్నిస్తుంటే, మనం చైనాపై ఆధారపడాలని ఆ దేశం కోరుకొంటోంది. కనుక కేంద్రం ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్ భారత్‌’ దిశలో చురుకుగా అడుగులు ముందుకు వేసి వీలైనంత త్వరగా ఈ చైనా ఊబిలో నుంచి బయటపడాలి. 


Related Post