జీతాల కోతపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీస్ జారీ

June 19, 2020


img

మార్చి 24 నుంచి మొదలైన లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయం చాలా తగ్గిపోవడం, కేంద్రం నుంచి నిధులు అందకపోవడంతో ఏప్రిల్, మే నెల వేతనాలు, పింఛన్లలో కోత విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దానిని సవాలు చేస్తూ మాజీ డీఎఫ్ఓ రామన్ గౌడ్ హైకోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. 

విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు, పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు చెల్లించే వేతనాలు, పెన్షన్లలో కోత విధించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదని, కానీ దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి కోత విధిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్దమని పిటిషనర్‌ వాదించారు. ఆయన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వానికి మూడు వారాలలోగా కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఈరోజు నోటీస్ జారీ చేసింది. 

అయితే లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించినప్పటి నుంచి రాష్ట్రంలో మళ్ళీ చాలా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు పనిచేస్తున్నందున వాటి నుంచి పన్నుల రూపేణా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. కేంద్రానికి కూడా రాష్ట్రాల నుంచి పన్నుల రూపేణా మళ్ళీ ఆదాయం వెళుతోంది కనుక పన్నుల సొమ్ములో రాష్ట్రాల వాటాలను చెల్లించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం మళ్ళీ పెరిగింది కనుక జూన్ నెల జీతాలు, పెన్షన్లలో ఎటువంటి కోత విధించకుండా చెల్లించే అవకాశం ఉంది. పరిస్థితులు మెల్లగా చక్కబడుతున్నాయి కనుక త్వరలోనే ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కోసుకొన్న సొమ్మును కూడా తిరిగి చెల్లించడమో లేదా చెల్లింపుకు తేదీలను ప్రకటించడమో చేయవచ్చు. కనుక హైకోర్టులో మళ్ళీ ఈ పిటిషన్‌ విచారణకు వచ్చే సమయానికి బహుశః ఈ సమస్య పరిష్కారం అయిపోవచ్చు.


Related Post