కరోనా నియంత్రణపై ప్రభుత్వం ఆసక్తి కోల్పోయింది: హైకోర్టు

June 17, 2020


img

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఈరోజు చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనా పరీక్షలు, వైద్య సిబ్బందికి రక్షణ దుస్తులు (పీపీఈ కిట్లు) తదితర అంశాలపై దాఖలైన ప్రజాప్రయోజన పిటిషన్‌పై బుదవారం విచారణ చేపట్టినప్పుడు, తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాకుండా, తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసింది. 

మళ్ళీ అన్ని జిల్లాలకు కరోనా వైరస్ వ్యాపిస్తున్నప్పటికీ ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేయకుండా కరోనా నివారణలో తన బాధ్యత తీరిపోయినట్లుగా వ్యవహరిస్తోందని హైకోర్టు అంది. తెలంగాణ ప్రభుత్వం తీరు చూస్తే ఇకపై ప్రజలు వారంతట వారే కరోనాను ఎదుర్కొని బయటపడాలన్నట్లు ఉందని హైకోర్టు అంది. రాష్ట్రంలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతుంటే ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని, కరోనా నివారణపై ప్రభుత్వంలో ఆసక్తి, ఉత్సాహం సన్నగిల్లినట్లు కనిపిస్తోందని అసహనం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షల విషయంలోనూ ప్రభుత్వం చాలా నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని, పరీక్షలు చేయకుంటే కరోనాను ఏవిధంగా గుర్తించగలమని ప్రశ్నించింది. 

రాష్ట్రంలో నీమ్స్ వంటి అనేక ఆసుపత్రులు ఉండగా కరోనా కేసులన్నీ గాంధీ ఆసుపత్రికే ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించింది. కరోనా రోగులందరినీ గాంధీ ఆసుపత్రికే పంపిస్తుండటం వలన దానిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందిపై ఒత్తిడి పెరిగిపోతోందని జూనియర్ డాక్టర్ల ఆందోళనలే అందుకు నిదర్శనమని హైకోర్టు అంది.   

కరోనా ఆసుపత్రులలో వైద్యసిబ్బందికి పీపీఈ కిట్లు వగైరా అందించి, సదుపాయాలు కల్పించాలని మూడు వారాలుగా తాము పదేపదే చెపుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇదేవిధంగా హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కటినంగా వ్యవహరించవలసి వస్తుందని హెచ్చరించింది.  

ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం ఎన్ని మాస్కూలు, పీపీఈ కిట్లు సరఫరా చేసిందో నివేదిక అందజేయాలని గాంధీ ఆసుపత్రి, నీమ్స్, ఫీవర్, కింగ్ కోఠీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లను హైకోర్టు ఆదేశించింది. రేపు జరుగబోయే విచారణకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌లు హాజరవ్వాలని ఆదేశించింది. 

ఇదివరకు ఈ కేసులపై విచారణ జరిపినప్పుడు కూడా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసినప్పుడు ప్రభుత్వం తన వైఖరిని గట్టిగా సమర్దించుకొంది. అంటే హైకోర్టు అభిప్రాయాలు తమకు అంగీకారం కాదని చెప్పకనే చెప్పింది. 

కరోనాను ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం చాలా దూరదృష్టితో వ్యవహరిస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పిన రెండు రోజులకే హైకోర్టు ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం గమనిస్తే, ప్రభుత్వ తీరు ఆమోదయోగ్యంగా లేదని హైకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పినట్లయింది. 

ఇదివరకు ఆర్టీసీ సమ్మె సందర్భంగా విచారణ జరిగినప్పుడు హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై ఇదేవిధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ చివరికి ఆ వ్యవహారంలో కలుగజేసుకోలేమని తప్పుకోవడంతో ప్రభుత్వం-హైకోర్టు మద్య ఘర్షణ తప్పిపోయింది. మళ్ళీ ఇప్పుడు అటువంటి ఘర్షణ వాతావరణమే కనిపిస్తోంది కనుక ఈసారి ఇది ఎలా ముగుస్తుందో చూడాలి.


Related Post