గణాంకాలను పక్కనపెట్టి...జాగ్రత్తలు పాటిద్దాం

June 10, 2020


img

భారత్‌లో 130 కోట్లకు పైగా జనాభా...వారిలో సగానికి పైగా నిరుపేదలున్నందున దేశంలో కరోనా ప్రవేశిస్తే పరిస్థితులు చాలా దారుణంగా తయారవుతాయని అగ్ర రాజ్యాలు, ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా వేశాయి. కానీ మొదట్లోనే లాక్‌డౌన్‌ విధించి, చాలా అప్రమత్తంగా వ్యవహరించడంతో భారత్‌ కరోనాను కట్టడి చేయగలిగింది. అయితే లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించినప్పటి నుంచి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం బుదవారంనాటికి దేశంలో 2,76,583 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రోజుకు 9 నుంచి 10,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆ లెక్కన జూలై నెలాఖరుకి సుమారు 10 లక్షల కేసులు నమోదు కావచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 

కారణాలు ఏవైతేనేమీ, చాలా రాష్ట్రాలలో ప్రభుత్వాలు కరోనా లెక్కలు, పరీక్షల విషయంలో గోప్యత పాటిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలలో చాలా తక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అంటే కరోనా రోగులను గుర్తించి, చికిత్స అందించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నట్లే భావించవలసి ఉంటుంది. దాని వలన కరోనా సోకినట్లు తెలియనివ్యక్తులు యధేచ్చగా ప్రజల మద్య కలిసి తిరుగుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు శరవేగంగా పెరిగిపోవడానికి ఇదీ ఒక కారణమేనని చెప్పవచ్చు.  

కనుక రాష్ట్ర ప్రభుత్వాలు రోజూ ప్రకటిస్తున్న కరోనా గణాంకాల కంటే ప్రతీ రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు. వాస్తవ లెక్కలకు, ప్రభుత్వ లెక్కలకు మద్య తేడా ఉన్నట్లయితే శాస్త్రవేత్తలు చెపుతున్న ఈ అంచనాలు కూడా మారుతాయని వేరే చెప్పక్కరలేదు. కనుక కరోనా సోకకుండా ప్రభుత్వాలు చెపుతున్న జాగ్రత్తలను ప్రజలు పాటించడం చాలా మంచిదే కానీ ప్రభుత్వ గణాంకాలను గుడ్డిగా నమ్మి నిర్లక్ష్యంగా బయట తిరిగితే చివరకు వారే బలయ్యే ప్రమాదం ఉంటుంది. 


Related Post