తెలంగాణ ప్రభుత్వానికి కరోనా పరీక్షలు!

June 09, 2020


img

తెలంగాణ ప్రభుత్వం 10వ తరగతి విద్యార్దులకు పరీక్షలు రద్దు చేసింది కానీ కరోనా విషయంలో ప్రభుత్వమే పరీక్షలు ఎదుర్కోవలసివస్తుండటం విశేషం. ఆసుపత్రులలో చనిపోయినవారి మృతదేహాలకు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయాలని హైకోర్టు పట్టుబడుతోంది. కానీ ఇతరత్రా దీర్గకాలిక వ్యాధులతో చనిపోయినవారికి పరీక్షలు జరిపించి, వాటిని కరోనా మరణాలుగా చెప్పడం అశాస్త్రీయం అవుతుందని తెలంగాణ ప్రభుత్వం వాదన. పైగా రాష్ట్రంలో రోజుకు 900 నుంచి 1,000 మంది చనిపోతుంటారని వారందరి మృతదేహాలకు కరోనా పరీక్షలు జరపాలంటే ఇక అన్ని పనులు మానుకోవలసి వస్తుందని వాదిస్తోంది. కరోనా విషయంలో మీడియాలో ఒక వర్గం, కొందరు వ్యక్తులు పనికట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వంపై బురద జల్లెందుకే కోర్టులలో ప్రజాహిత వాజ్యాలు వేస్తున్నారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

ఆసుపత్రులలో మరణించినవారికి మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు చెపుతోంది తప్ప రాష్ట్రంలో ఎక్కడ ఎవరు చనిపోయినా పరీక్షలు చేయమని చెప్పడం లేదు. ఒక వ్యక్తి ఏ కారణంతో చనిపోయినప్పటికీ అతను లేదా ఆమెకు కరోనా ఉందో లేదో తెలుసుకోవడం చాలా అవసరం. ఒకవేళ ఉన్నట్లయితే అంతకు మునుపు ఆ వ్యక్తిని కలిసినవారందరికీ కరోనా సోకే ప్రమాదం ఉంటుంది కనుక వారిని గుర్తించి కరోనా చికిత్స చేయవచ్చు. కరోనా సోకిన మృతదేహాన్ని బందువులకు అప్పగిస్తే అంత్యక్రియల సందర్భంగా వారందరికీ కరోనా సోకే ప్రమాదం ఉంటుంది కనుకనే ఆసుపత్రులలో చనిపోయినవారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు పట్టుబడుతోంది. కానీ అందుకు ప్రభుత్వం వెనకాడుతుండటం విస్మయం కలిగిస్తుంది. 

దీర్గకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి కరోనా సోకి చనిపోతే ఎవరూ ప్రభుత్వాన్ని తప్పుపట్టలేరు...నిందించలేరు. కానీ అటువంటి కేసులను కూడా కలిపితే రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య పెరిగిపోతాయి. దాంతో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందనే భయంతో మృతదేహాలకు కరోనా పరీక్షలు చేయడానికి వెనకాడుతోందేమో?

కరోనా పరీక్షలు చేయడానికి ప్రభుత్వం వెనకాడితే ఎవరికి కరోనా సోకిందో తెలియదు కనుక ఆ వ్యక్తి ద్వారా ఇతరులకు కరోనా వైరస్ వ్యాపిస్తుంటుంది. దాంతో కరోనా కేసులు.. వాటితోపాటే కరోనా మరణాలు కూడా పెరిగిపోతాయి. అప్పుడు ప్రభుత్వం ఇంకా అప్రదిష్ట పాలవవచ్చు. పైగా కరోనా కేసులు పెరిగిపోతున్న కొద్దీ వారికి పరీక్షలు, చికిత్స చేయించేందుకు ప్రభుత్వంపై ఆర్ధిక భారం పెరిగిపోతుంటుంది కూడా! నిప్పు వంటి కరోనా వైరస్‌ను దాచిపెట్టాలనుకొన్నా సాధ్యం కాదు... పైగా ప్రమాదం కూడా. కనుక అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మంచిది కదా?


Related Post