ఇళ్ళలోనే కరోనా చికిత్సలకు ప్రజలు సహకరించాలి: ఈటల

June 08, 2020


img

హైదరాబాద్‌ నగరంలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యేవరు తక్కువ చేరేవారు ఎక్కువైపోయారు. దాంతో ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి ఇప్పటికే నిండిపోయింది. నేడో రేపో మిగిలిన ఆసుపత్రులు కూడా నిండిపోవచ్చు. కనుక కరోనా తీవ్రత తక్కువగా ఉన్నవారికి వారి ఇళ్ళలోనే చికిత్స అందించేందుకు చుట్టుపక్కల ప్రజలు సహకరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ విజ్ఞప్తి చేశారు. 

తాత్కాలిక సచివాలయంగా ఉన్న బీఆర్కేభవన్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ...చుట్టుపక్కల ప్రజల భయాందోళనలు, ఒత్తిళ్ళ కారణంగా కరోనా తీవ్రత తక్కువగా ఉన్నవారు కూడా వచ్చి ఆసుపత్రులలో చేరిపోతున్నారని, దాని వలన ఆసుపత్రులు నిండిపోయి, కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి చికిత్స చేసేందుకు కష్టం అవుతోందన్నారు. కనుక ఇకపై తీవ్రత తక్కువగా ఉన్నవారికి వారి ఇళ్ళలోనే చికిత్స అందించాలని భావిస్తున్నామని, అందుకు ప్రజలు కూడా క్వారెంటైన్‌లో ఉండేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ గాలిద్వారా వ్యాపించదు కనుక కరోనా రోగి ఇంట్లో ఉన్నా చుట్టుపక్కల ఇళ్ళలో ఉంటున్నవారు భయపడనవసరం లేదన్నారు. 

ఈ సమస్యను జయించాలంటే ప్రజల సహకారం తప్పనిసరి అని అన్నారు. కరోనా వైరస్‌ గురించి ప్రజలలో చాలా అపోహలున్నాయని వాటిని వీడితే ఈ సమస్యను అధిగమించవచ్చన్నారు. కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా తీవ్రత తక్కువగా ఉన్నవారికి వారి ఇళ్ళలోనే చికిత్స అందించడం ప్రారంభించామని మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. ఈవిధంగా చేస్తే వైద్యులు, వైద్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గించగలుగుతామని అన్నారు. ప్రజల జీవనోపాధి మార్గాలు దెబ్బ తింటున్నాయనే ఉద్దేశ్యంతోనే లాక్‌డౌన్‌ ఆంక్షలు ప్రభుత్వం సడలించిందని, కానీ అంతమాత్రాన్న అవసరం లేకుండా ప్రజలు రోడ్లపైకి రావద్దని మంత్రి ఈటల రాజేందర్‌ విజ్ఞప్తి చేశారు.


Related Post