భారత్‌, చైనాలపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

June 06, 2020


img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ భారత్‌, చైనాలపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని మెయిన్ నగరంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ, “అమెరికాలో 2 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేశాము. కరోనా పరీక్షలు ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువ కేసులు బయటపడతాయని నేను ముందే చెప్పాను. చెప్పినట్లుగానే అమెరికాలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ విషయంలో మేము చాలా పారదర్శకంగా ఉన్నప్పటికీ భారత్‌, చైనాలు లేవని భావిస్తున్నాను. ఒకవేళ ఆ రెండు దేశాలలో కూడా విస్తృతంగా కరోనా పరీక్షలు జరిపించినట్లయితే, అమెరికా కంటే చాలా ఎక్కువ కేసులే బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నాను,” అని ట్రంప్‌ అన్నారు. 

కరోనా లెక్కల విషయంలో ట్రంప్‌ మొదటి నుంచి చైనాపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు భారత్‌ను కూడా ఆ గాట కట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ ట్రంప్‌ చెప్పినట్లుగా 130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌లో కరోనాను దాచిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అది ఎంతో కాలం దాగదని అందరికీ తెలుసు. ఈ పాటికే లక్షలమంది చనిపోయుండేవారు. కానీ భారత్‌ శక్తికి మించిన పనే అయినప్పటీకీ దేశ ఆర్ధిక వ్యవస్థను పణంగా పెట్టి ఏకధాటిగా రెండు నెలలు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలుచేయడం వలననే దేశంలో ఇంతకాలం కరోనా మహమ్మారి కట్టడిలో ఉంది. అది చూసి ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా పలుదేశాలు హర్షించాయి కూడా. భారత్‌ ముందే మేల్కొని కరోనాను ఎదుర్కొగా ట్రంప్‌ మొదట్లో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినందునే అమెరికాలో లక్షకు పైగా ప్రజలు కరోనాకు బలయ్యారు. కానీ డోనాల్డ్ ట్రంప్‌ తన వైఫల్యాన్ని ఒప్పుకోకుండా ఇతర దేశాలను వేలెత్తి చూపుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది.


Related Post