లాక్‌డౌన్‌ పొడిగించవచ్చు: కిషన్ రెడ్డి

April 29, 2020


img

లాక్‌డౌన్‌ కారణంగా నెలరోజులకు పైగా ఇళ్లకే పరిమితమైన దేశప్రజలు మే3వ తేదీ కొరకు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మరో నాలుగు రోజులలో లాక్‌డౌన్‌ గడువు ముగుస్తుంది కనుక మళ్ళీ స్వేచ్ఛగా బయటకు వెళ్ళవచ్చని అందరూ ఎదురుచూస్తున్నారు. కానీ మరో రెండువారాలు లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశాలున్నాయి.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి బుదవారం మీడియాతో మాట్లాడుతూ, “రెడ్‌జోన్‌, కంటెయిన్‌మెంట్ ప్రాంతాలలో మే 3 తరువాత లాక్‌డౌన్‌ యధాతధంగా కొనసాగుతుంది. ఆ ప్రాంతాలలో ఎటువంటి సడలింపులు ఉండబోవు. కరోనా రహితంగా గుర్తించబడిన గ్రీన్‌జోన్‌లలో మాత్రం కొన్ని ఆంక్షలతో లాక్‌డౌన్‌ ఎత్తివేసి పరిశ్రమలు, అన్ని సంస్థలు తిరిగి పనులు మొదలుపెట్టేందుకు అనుమతిస్తాము. అయితే బస్సులు, రైళ్లు, మెట్రో రైళ్లు, విమానాల సేవలపై మరికొన్ని రోజులు నిలిపివేయబడతాయి. ఇప్పటికే గ్రామీణప్రాంతాలలో లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించాము. కరోనా వ్యాప్తి చెందకుండా మళ్ళీ అన్ని సంస్థలు ఏవిధంగా పనిచేసుకోవాలనేది ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న ప్రధానసమస్య. ప్రజలందరూ మస్కూలు ధరించడం, సామాజిక దూరం పాటించడం, రోగనిరోధకశక్తిని పెంచుకోవడం వంటి జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. కరోనాకు మందులు కనుగొనేవరకు ఇంతకు మించి వేరే మార్గం లేదు. కరోనాకు వ్యాక్సిన్ తయారుచేసేందుకు భారత్‌లో ముమ్మురా ప్రయత్నాలు జరుగుతున్నాయి,” అని అన్నారు. 


Related Post