ఈసారి సమావేశంలో ముఖ్యమంత్రులు ఏమి చెపుతారో?

April 22, 2020


img

దేశంలో కరోనాను కట్టడి చేయడంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్రమోడీతో కలిసికట్టుగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రధాని నరేంద్రమోడీ కూడా ముఖ్యమంత్రులతో తరచూ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమవుతూ వారి విలువైన సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఫెడరల్ స్పూర్తిని చాటుతున్నారు. ఈ కష్టకాలంలో పార్టీలు, రాజకీయాలకు అతీతంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా చక్కటి సమన్వయంతో కరోనా మహమ్మారిని ఎదుర్కొంటుండటం చూసి ప్రపంచదేశాలు, ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ అందరూ హర్షిస్తున్నారు. 

రాష్ట్రాలలో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ అమలు, మే 3న లాక్‌డౌన్‌ ముగిసిన తరువాత తదుపరి కార్యచరణపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడీ మళ్ళీ ఈనెల 27న ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశం కానున్నారు. 

నేటికీ దేశంలో కరోనా నియంత్రణలోకి రాకపోగా ఇప్పుడు కరోనా సోకినవారిలో ఎటువంటి రోగలక్షణాలు కనిపించడం లేదని, 14 రోజుల క్వారెంటైన్ తరువాత కరోనా బయటపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలు నిజమైతే నిజంగా అవి చాలా ఆందోళనకరమైనవే. ఎందుకంటే, ఎటువంటి రోగలక్షణాలు కనబడకపోతే కరోనా రోగులు తాము ఆరోగ్యవంతులమనే భావించి బయటతిరుగుతుంటారు కనుక వారిద్వారా కరోనా వైరస్ శరవేగంగా ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంది. ఒకవేళ కరోనా బయటపడటానికి నెలరోజులు సమయం పడుతున్న వార్తలు నిజమైతే, అటువంటివారి వలన కూడా కరోనా వైరస్ చాలా మందికి వ్యాపించే ప్రమాదం ఉంది. 

ఏది ఏమైనప్పటికీ లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పుడే కేవలం వారం రోజుల వ్యవధిలో దేశంలో కరోనా కేసులు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఒకవేళ మే 4న పాక్షికంగా లాక్‌డౌన్‌ ఎత్తివేసినా కరోనా వైరస్ ఇంకా వేగంగా దేశమంతటా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అదే కనుక జరిగితే సుమారు నెలరోజులుగా చేస్తున్న ఈ లాక్‌డౌన్‌ అంతా వృధాగా మారుతుంది. కనుక ఈసారి ప్రధాని సమావేశంలో కూడా ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ పొడిగించమని కోరే అవకాశాలే ఎక్కువ. కానీ లాక్‌డౌన్‌ కారణంగా అన్ని రాష్ట్రాలు ఆర్ధికంగా చితికిపోతున్నాయి కనుక ఈసారి సమావేశంలో మరికొన్ని రంగాలకు, గ్రీన్‌ జోన్‌ జిల్లాలకు లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి మరికొన్ని మినహాయింపులు ఇవ్వమని సూచించవచ్చు.


Related Post