ఇంకా వేడుకోవడాలు..హెచ్చరికలు ఎన్నాళ్ళు?

April 18, 2020


img

దాదాపు నెలరోజులుగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నప్పటికీ రాష్ట్రంలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి తప్ప ఏమాత్రం ఆగడం లేదు. పైగా ఆసుపత్రులలో కరోనా రోగులు, కరోనా అనుమానితులు తమకు సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నా వారిపై ప్రభుత్వాలు కటినమైన చర్యలు తీసుకోకుండా హెచ్చరికలతోనే సరిపెడుతోందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అయితే రోగులు బయటకు రావాలని ఇంకా ఎంత కాలం బ్రతిమాలుకొంటారు?ఇంకా ఎంతకాలం హెచ్చరికలతో సరిపెడతారు? అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ నిబందలను ఉల్లంఘించినవారి పట్ల కటినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు, కరోనా వైరస్‌ సోకి ఇళ్ళలో దాకొన్నవారివలన యావత్ సమాజానికే ప్రమాదం ఉందని తెలిసి ఉన్నప్పటికీ వారి పట్ల ఎందుకు కటినంగా వ్యవహరించ లేకపోతున్నాయి? సమాజానికి హాని కలిగించేవారి పట్ల కటినంగా వ్యవహరించకుండా ‘దయచేసి బయటకు వచ్చి పరీక్షలు, చికిత్స చేయించుకోమని ఇంకా ఎందుకు బ్రతిమాలుతున్నాయి? అని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

కారణాలు ఏవైనప్పటికీ, ఇళ్ళలో దాకొన్న కరోనా రోగుల పట్ల ప్రభుత్వాలు ఇదేవిధంగా మెతక వైఖరి ప్రదర్శిస్తున్నట్లయితే దేశంలో కరోనాను కట్టడి చేయడం ఎప్పటికీ సాధ్యం కాకపోవచ్చు. దాదాపు నెలరోజులుగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నప్పటికీ అన్ని రాష్ట్రాలలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతుండటమే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అసలు 14 రోజుల ఐసోలేషన్ పీరియడ్... 3వారాల లాక్‌డౌన్‌ తరువాత కూడా ‘కరోనా గొలుసు’ ఇంకా ఎందుకు తెగడంలేదు?లాక్‌డౌన్‌ సమయంలోనే కరోనాను కట్టడి చేయలేనప్పుడు 20వ తేదీ నుంచి పాక్షికంగా ఆంక్షలు ఎత్తివేశాక దేశంలో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో తేలికగానే ఊహించవచ్చు. 

ఇక తెలంగాణ ప్రభుత్వం విషయానికి వస్తే ఒకేసారి లక్షమంది కరోనా రోగులకు చికిత్స అందించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసుకొన్నామని చెపుతోంది. ఇంత తక్కువ సమయంలో అంతా ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనీయమే. అయితే ఒకేసారి అంతమందికి వైద్యం చేయడం సులువా? లేక ఇళ్ళలో దాకొన్న కరోనా రోగులతో కటినంగా వ్యవహరించి బయటకు రప్పించి 1,000 లోపు కేసులున్న ఇప్పుడే కరోనాకు అడ్డుకట్ట వేయడం సులువా? అని ఆలోచిస్తే బాగుంటుందని ప్రజాభిప్రాయం. 

ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది తీవ్ర భయాందోళనలకులోనై ఉన్నారు. కరోనా రోగుల తీరుతో విసిగెత్తిపోయున్న వారు ఈ పరిస్థితులలో కాస్త నిర్లిప్తంగా వ్యవహరిస్తే ఏమవుతుంది? ఒకవేళ వారు వెనకడుగు వేస్తే అప్పుడు ప్రజలను కాపాడుతారు?అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

కనుక సద్గురు జగ్గీ వాసుదేవ్ బాబా చెప్పినట్లుగా దేశహితం కోసం...కోట్లాదిప్రజల శ్రేయస్సు కోసం ఈ సమయంలోనే పాలకులు ధైర్యంగా, అవసరమైతే కటినంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. లేకుంటే ప్రభుత్వాలు చేస్తున్న ఈ ప్రయత్నాలు, లక్షల కోట్ల ఆర్ధిక నష్టం భరిస్తూ చేస్తున్న ఈ లాక్‌డౌన్‌, నిరుపేదల త్యాగాలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ వృధా అయిపోతాయి.


Related Post