కరోనా కేసులు, మృతుల సంఖ్య పెంచిన చైనా!

April 17, 2020


img

యావత్ ప్రపంచదేశాలలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మృతులు సంఖ్య పెరిగిపోతుంటే ఒక్క చైనాలో మాత్రం లాక్‌డౌన్‌ ఎత్తివేసినప్పటికీ దాదాపు నిలకడగా ఉండటం విశేషం. కరోనా వైరస్‌కు ఇంతవరకు వ్యాక్సిన్, మందు కనుగొనకపోయినా చైనాలో మాత్రం ఎవరూ కరోనా బారినపడి చనిపోవడం లేదు! వూహాన్ నగరంలో కరోనా వైరస్‌ బయటపడినప్పటి నుంచి చైనా వైఖరి చాలా అనుమానాస్పదంగానే ఉంటోందని చాలా దేశాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా కేసులు, మృతుల విషయంలో చైనా ఏదో దాస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అనుమానం వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ దానంతట అదే పుట్టిందా లేక ప్రపంచదేశాలపై ఆధిపత్యం సాధించేందుకు చైనాయే కరోనా వైరస్‌ను సృష్టించి లోకం మీదకు వదిలిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనిపై లోతుగా దర్యాప్తు జరిపి నిజానిజాలు బయటపెడతామని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్ పాంపియో ప్రకటించారు. 

కరోనా వైరస్‌ విషయంలో యావత్ ప్రపంచదేశాలు తమను అనుమానిస్తుండటంతో చైనా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అది ప్రకటించిన కరోనా కేసులు, మృతుల సంఖ్యలను శుక్రవారం కొద్దిగా పెంచింది. అయితే ప్రపంచదేశాల ఒత్తిడి వలన ఆవిధంగా చేసినట్లు చెప్పుకోలేదు కనుక వూహాన్ నగర అధికారుల చేత ట్విట్టర్‌లో    ఈ సవరింపులకు సంజాయిషీ ఇప్పించింది. 

“కరోనా వైరస్‌ ఉదృతంగా ఉన్న సమయంలో నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్సలు పొందినవారి వివరాలు సేకరించలేకపోయాము. ఇప్పుడు ఆ ఒత్తిడి తగ్గింది కనుక పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి సమర్పిస్తున్నాము,” అని దాని సారాంశం. 

వూహాన్‌లో గురువారంనాటికి 2,579 మంచి చనిపోయినట్లు ప్రకటించగా కొత్త లెక్కల ప్రకారం 3,869 మంది చనిపోయినట్లు ప్రకటించింది. వాటి ప్రకారం చైనాలో కరోనా మృతుల సంఖ్య ఒక్కరోజులో 4,636కి పెరిగింది. అలాగే కొత్తగా 325 మందికి కరోనా సోకినట్లు ప్రకటించింది. 

అయితే అనధికార లెక్కల ప్రకారం ఒక్క వూహాన్ నగరంలోనే 30-45,000 మంచి కరోనా బారినపడి మరణించి ఉండవచ్చని అంతర్జాతీయ మీడియా చెపుతోంది. చైనాలో వేలసంఖ్యలో ఉన్న చనిపోయినవారి ఆస్తికల డబ్బాలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చూపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ చైనా ఇప్పుడు ప్రపంచదేశాల ముందు దోషిగా నిలబడవలసివస్తోంది. అది స్వయంకృతాపరాధామా కాదా అనేది భవిష్యత్‌లో తెలుస్తుంది.


Related Post