తెలంగాణలో కరోనా జోన్స్ ఇవే

April 16, 2020


img

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాలలో నమోదైన కరోనా కేసులు, వాటి వ్యాప్తిని బట్టి రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లను గుర్తిస్తూ బుదవారం రాత్రి ఒక సర్క్యులర్ జారీ చేసింది.   

దేశవ్యాప్తంగా 170 జిల్లాలు రెడ్‌ జోన్‌లో, 207 జిల్లాలు ఆరెంజ్‌ జోన్‌లో, మిగిలినవన్నీ గ్రీన్‌ జోన్‌లో ఉన్నట్టు తెలియజేసింది. కరోనా తీవ్రత, వ్యాప్తిని బట్టి రెడ్‌ జోన్‌ను మళ్లీ లార్జ్‌ ఔట్‌బ్రేక్‌ జిల్లాలు, క్లస్టర్ జిల్లాలని రెండుగా విభజించింది. దేశంలో లార్జ్‌ ఔట్‌బ్రేక్‌ జిల్లాలు-173, రెడ్‌ హాట్‌స్పాట్‌ క్లస్టర్ జిల్లాలు-47 ఉన్నట్లు ప్రకటించింది. 

తెలంగాణ రాష్ట్రంలో 8 రెడ్‌ జోన్‌ జిల్లాలు, ఒక రెడ్‌ హాట్‌స్పాట్‌ క్లస్టర్ జిల్లా ఉన్నట్లు ప్రకటించింది. 

రెడ్‌ జోన్‌ (లార్జ్‌ ఔట్‌బ్రేక్‌) జిల్లాలు : హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్‌ అర్బన్, రంగారెడ్డి, జోగుళాంబ గద్వాల, మేడ్చల్‌-మల్కాజిగిరి, కరీంనగర్, నిర్మల్‌ జిల్లాలు.

రెడ్‌ హాట్‌ స్పాట్‌ క్లస్టర్‌ జిల్లా: నల్లగొండ జిల్లా

ఆరెంజ్‌ జోన్‌ (నాన్‌–హాట్‌స్పాట్‌) జిల్లాలు : సూర్యాపేట, ఆదిలాబాద్,  మహబూబ్‌నగర్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్‌ భూపాలపల్లి, కొమరంభీమ్‌ ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలు.

గ్రీన్‌ జోన్‌ జిల్లాలు: వరంగల్‌ రూరల్, మంచిర్యాల, వనపర్తి, నారాయణ పేట, యదాద్రి భువనగిరి జిల్లాలు. ఈ 5 జిల్లాలలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కనుక వీటిని కరోనా రహిత గ్రీన్‌ జోన్‌ జిల్లాలుగా కేంద్రప్రభుత్వం గుర్తించింది.    

కేంద్రప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం ఆయా జోన్లలో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. రానున్నరోజులలో ఆరెంజ్‌ జోన్‌, గ్రీన్‌ జోన్‌ జిల్లాలలో కరోనా వైరస్ తీవ్రత, కేసుల సంఖ్య పెరిగినట్లయితే వాటి జోన్‌లను పై స్థాయికి సవరిస్తూ తదనుగుణంగా కార్యాచరణ చేపట్టాలని కేంద్రప్రభుత్వం సూచించింది. ఇకపై కేసులు సంఖ్య రెట్టింపు అయితే రెడ్‌ జోన్‌లోకి, రాబోయే రెండు వారాలలో కొత్త కేసులు నమోదు కాకపోతే రెడ్‌ నుంచి ఆరెంజ్‌ జోన్‌లోకి, 28 రోజులలో కొత్త కేసులు నమోదు కాకపోతే ఆరెంజ్‌ నుంచి గ్రీన్‌ జోన్‌లోకి మార్చాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ప్రతీ సోమవారం అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా ఈ ప్రక్రియ చేపట్టాలని సూచించింది.


Related Post