గాంధీలో అవుట్ సోర్సింగ్ నర్సులు సమ్మె నోటీస్

April 15, 2020


img

ప్రస్తుతం రాష్ట్రంలో సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి చాలాకీలకంగా నిలుస్తోంది. రాష్ట్రంలో ఏ జిల్లాలలో కరోనా సోకినా వారికి గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకపక్క గాంధీ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది అందరూ తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు చికిత్సలందిస్తుంటే ఆసుపత్రిలో పనిచేస్తున్న సుమారు 200 మంది అవుట్ సోర్సింగ్ నర్సులు సమ్మెకు సిద్దమయ్యారు.

తాము గత 13 ఏళ్లుగా ఇదే ఆసుపత్రిలో రెగ్యులర్ నర్సులతో సమానంగా పనిచేస్తున్నామని, నానాటికీ పని ఒత్తిడి పెరుగుతోంది కానీ జీతాలు పెరగడం లేదని, ఆ జీతాలు కూడా ప్రతీనెల సకాలంలో అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనుక తామందరినీ తక్షణం రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర కుటుంబ ఆరోగ్య శాక నిబందలన ప్రకారం అవుట్ సోర్సింగ్ నర్సులకు రూ. 23,000 ఇవ్వవల్సి ఉండగా రూ.17,000 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు చికిత్సలందిస్తుంటే రోగులు, వారి కుటుంబ సభ్యులు తమపట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడంలేదని అందుకే తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేందుకే ఇప్పుడు సమ్మె చేయడానికి సిద్దపడుతున్నామని వారు తెలిపారు. కనుక ప్రభుత్వం తక్షణం తమ సమస్యలను పరిష్కరించవలసిందిగా అవుట్ సోర్సింగ్ నర్సులు డిమాండ్ చేశారు. 

ఆర్టీసీకి అత్యంత కీలకమైన దసరా, దీపావళి పండుగలకు ముందు ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగినప్పుడు వారితో ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరించిందో, 55 రోజుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు ఎన్ని కష్టాలు పడ్డారో అందరూ చూశారు. సుమారు 50,000 ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసి రాష్ట్రాన్ని దిగ్బందనం చేసినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం భయపడకుండా ముందుకు సాగింది. ఇప్పుడు కేవలం 200 మంది అవుట్ సోర్సింగ్ నర్సులు సమ్మె చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దిగివస్తుందనుకోవడం చాలా పొరపాటు.    

కనుక అవుట్ సోర్సింగ్ నర్సులు తక్షణం సమ్మె ఆలోచన విరమించుకొంటె వారికే మంచిది. కరోనా సంక్షోభం ముగిసిన తరువాత వారు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మాట్లాడితే క్లిష్టసమయంలో సేవలు అందించినందుకు సానుకూలంగా స్పందించవచ్చు. కాదని ఇటువంటి క్లిష్ట సమయంలో సమ్మె చేస్తే ఆర్టీసీ సమ్మె పరిస్థితులు మళ్ళీ పునరావృతం కావచ్చు.


Related Post