కరోనాను మతానికి ముడిపెట్టొద్దు: ఓవైసీ

April 03, 2020


img

దేశంలో లాక్‌డౌన్‌ అమలుచేసిన తరువాత కరోనా వైరస్‌ నియంత్రణలోకి వస్తోందనుకొంటున్న సమయంలో నిజాముద్దీన్‌ మత సమావేశాలలో పాల్గొని రాష్ట్రాలకు తిరిగి వచ్చినవారి ద్వారా కరోనా వైరస్‌ ఇతరులకు సోకుతుండటంతో గత 2-3 రోజులలోనే దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శరవేగంగా పెరగడం ప్రారంభమైంది. 

దీనిపై మీడియాలో ముఖ్యంగా..సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలలో నిజాముద్దీన్‌ మత సమావేశాలను నిర్వహించినవారిపై, వాటిలో పాల్గొని వచ్చినవారి ద్వారా రాష్ట్రాలలో శరవేగంగా కరోనా వ్యాపిస్తుండటంపై తీవ్ర ఆందోళన, ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. 

దీనిపై కొందరు ముస్లిం మతపెద్దలు, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కేంద్రప్రభుత్వం, మీడియా తమను లక్ష్యంగా చేసుకొని తమ వర్గం ప్రజలపై బురదజల్లే ప్రయత్నాం చేస్తున్నాయని ఆరోపించారు. కరోనాను మతంతో ముడిపెట్టడం సరికాదని వాదిస్తున్నారు. తాము చట్టానికి లోబడే అన్ని అనుమతులు తీసుకొని మతసమావేశాలు నిర్వహించుకొన్నాము తప్ప కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు తెలియకుండా రహస్యంగా చట్టవిరుద్దంగా నిర్వహించుకోలేదని వాదిస్తున్నారు. 

విదేశాల నుంచి నిజాముద్దీన్‌ మత సమావేశాలకు హాజరైనవారి పూర్తి వివరాలు కేంద్రప్రభుత్వం వద్ద ఉన్నాయని అన్నారు. నిజానిని నిజాముద్దీన్‌ మత సమావేశాల నిర్వాహకులే కరోనా లక్షణాలున్న వారి గురించి కేంద్రప్రభుత్వానికి, డిల్లీ ప్రభుత్వానికి తెలియజేసి వారీనందరినీ ఐసోలేషన్ వార్డులకు తరలించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోలేదని కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలననే ఈ సమస్య తీవ్రరూపం దాల్చిందని వాదించారు.


Related Post