మన వైద్యవిధానంలో లోపాలతోనే ఈ దుస్థితి?

March 26, 2020


img

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ఇప్పుడు భారత్‌పై కూడా పడి విధ్వంసం సృష్టిస్తోంది. కంటికి కనబడని ఆ శత్రువును ఎదుర్కోవడానికి చేతిలో ఆయుధమే లేదు. చేతిలో ఆయుధం లేదు కనుక దేశాన్ని అష్టదిగ్బందనం చేసుకొని ఇళ్ళలో దాక్కొని కరోనా అనే శత్రువుకు చిక్కకుండా తప్పించుకోవాలని యావత్ ప్రపంచం ప్రయత్నిస్తోంది. ఇళ్ళలో దాక్కొని శత్రువును గెలవాలనుకోవడం చాలా ఆశ్చర్యకరమే. 

ఇటువంటి మహమ్మారి ఏదైనా వ్యాపిస్తే, ఏ అమెరికా, చైనా లేదా ఏ యూరప్ దేశాలో దానికి మందులు కనుగొని అందిస్తే తప్ప మనంతట మనం కనుగొనలేకపోతున్నామంటే మనం శాస్త్ర పరిశోధనలలో ఎంత అలసత్వం ప్రదర్శిస్తున్నామో అర్ధం అవుతుంది. 

ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్షంలో అద్భుతాలు చేస్తుంటే, మన  వైద్య, పరిశోధనారంగాలు మాత్రం ఇంకా మూస ధోరణిలోనే సాగిపోతుండటం చాలా బాధాకరం. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఎలాగూ మన దగ్గర మందులు లేవు. పోనీ...తగినంతమంది వైద్యులు, నర్సులు, సిబ్బంది, ఆసుపత్రులు అయినా ఉన్నాయా అంటే అవీ లేవు. అందుకే రిటర్డ్ వైద్యులు, నర్సుల సేవలు ఉపయోగించుకోవాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. 130 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశానికి ఎన్నో లక్షల మంది వైద్యులు అవసరం కాగా లోపభూయిష్టమైన, అనాలోచితమైన మన వైద్యవిధానాల వలన ఏడాదికి కొన్ని వేలమంది వైద్యులను మాత్రమే తయారు చేసుకోగలుగుతున్నాము. దానికీ.. విపరీతమైన పోటీ ఉంటుంది...కనీసం కోటి రూపాయలు చేతిలో ఉంటే తప్ప ఎంబీబీఎస్ చేయలేని దుస్థితి నెలకొంది. 

దేశానికి లక్షల మంది వైద్యులు అవసరం ఉండగా వారికి బదులు లక్షలమంది ఇంజనీర్లను ఉత్పత్తి చేసుకొంటున్నాము. బీటెక్ చేసి బయటకు వస్తున్నవారిలో అధికశాతం తమ అర్హతకు తగిన ఉద్యోగాలు సంపాదించుకోలేక పోలీస్ కానిస్టేబుల్ లేదా సేల్స్ మేనేజర్ వంటి ఉద్యోగాలు చేసుకొంటూ బ్రతుకుతుండటం అందరికీ తెలుసు. అంటే ఒకపక్క అవసరంలేనిది అతిగా ఉత్పత్తి చేసుకొంటూ, మరోపక్క అత్యవసరమైన వైద్యులను తయారీపై ఆంక్షలు విధించుకొంటూ చేజేతులా సమస్యలు సృష్టించుకొంతున్నామన్న మాట! 

దేశాజనాభాకు తగినంతమంది వైద్యులను తయారుచేసుకోకపోవడం వలన ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో చేతులెత్తేసి  ఇళ్ళలో దాక్కోమని చెప్పవలసి వస్తోంది. ఇది మన విద్యా, వైద్యవిధానం ఎంత లోపభూయిష్టంగా ఉందో కళ్ళకు కట్టినట్లు చూపుతోంది. 

ఇక 130 కోట్లు జనాభా ఉన్న దేశానికి ఇంతవరకు తగినన్ని ఆసుపత్రులు కూడా నిర్మించుకోలేకపోయాము. ఈ ఏడు దశాబ్ధాలలో ఏర్పాటు చేసుకొన్న కొద్దిపాటి ప్రభుత్వాసుపత్రుల పనితీరు, వాటిలో  ఉండే సమస్యలు, కొరతలు అందరికీ తెలిసినవే. కనీసం ఉన్న ఆ కొద్దిపాటి ఆసుపత్రులను చక్కదిద్దుకొందామని ఆలోచించకుండా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్య సేవలు అందజేస్తామని హామీలు ఇస్తూ ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులను ప్రభుత్వాలు పెంచిపోషిస్తున్నాయి. తద్వారా ప్రభుత్వాసుపత్రులకు దక్కవలసిన ఆదాయాన్ని కార్పొరేట్ ఆసుపత్రులు గద్దలా ఎగరేసుకుపోతున్నాయి. ఈ విషయం మేధావులైన మన పాలకులకు తెలియదనుకోలేము. అయినా వాటికే మొగ్గు చూపిస్తున్నారు. కారణాలు అందరికీ తెలుసు. 

ఈవిధంగా మన వైద్యవిధానంలో ఇన్ని లోపాలున్నప్పటికీ సరిదిద్దుకోకుండా గుడ్డిగా ముందుకు సాగిపోతుండటం వలననే నేడు ఇటువంటి దుస్థితి ఎదుర్కోవలసి వస్తోందని చెప్పక తప్పదు. కంటికి కనబడని కరోనా వైరస్ మన వైఫల్యాలను, అలసత్వాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది కనుక కనీసం ఇప్పటికైనా వైద్యవిధానంలో సమూలంగా మార్పులు చేసుకొని దేశానికి అవసరమైనంతమంది వైద్యులను తయారు చేసుకోవడం చాలా అవసరం.


Related Post