క్యా కరోనా?

March 24, 2020


img

కంటికి కనబడని కరోనా వైరస్ యావత్ ప్రపంచదేశాల ప్రజల జీవనశైలినే మార్చివేస్తోంది. ముఖ్యంగా సంపన్న భారతీయులపై కరోనా ప్రభావం చాలా ఎక్కువగా కనబడుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వారు ఇళ్ళకే పరిమితం కావలసి వస్తోంది. చేతిలో డబ్బున్నా జల్సా చేయలేకపోతున్నారు. పబ్బులు, చిందులకు దూరం అయ్యారు. విలాసవంతమైన కార్లలో దోస్తులనో గర్ల్ ఫ్రెండునో వేసుకొని లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లలేకపోతున్నారు. పోనీ ఈ ఊటీ..కొడైకెనాల్‌ లేదా గోవాలో వాలిపోదామంటే ఇంట్లో నుంచి కాలు బయట పెట్టడానికి వీలులేకుండా పోయింది. 

పోనీ..ఎంచక్కగా విమానాలలో విదేశాలకు ఎగిరిపోదామనుకుంటే భారత్‌లో కంటే అక్కడే కరోనా ఎక్కువగా ఉంది కనుక ఆ ఆలోచన చేయడానికే భయపడుతున్నారు. చేతి నిండా బోలెడంత డబ్బున్నా పనికిరాకుండా పోయింది పాపం. కనుక అయిష్టంగానైనా ఇంటికే పరిమితం కావలసివస్తోంది. ‘గాలికి పోయే పేలాలను కృష్ణార్పణం’ అని పుణ్యం సంపాదించుకోవాలని ఆశపడిన్నట్లు, బయటకు వెళ్ళే దారులన్నీ మూసుకుపోవడంతో, తాము ఇంట్లోనే స్వచ్ఛందంగా స్వీయనిర్బందం విధించుకొని ఉండిపోయామంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతూ “మీరు కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని సమాజ శ్రేయస్సు కోసం గృహనిర్బందంలో ఉండండి,” అంటూ నీతులు చెపుతున్నారు. 

ఇక దేశంలో మద్యతరగతి ప్రజలవి మరొక రకమైన సమస్యలు. పప్పులు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు బజారుకు వెళ్ళి స్వయంగా తెచ్చుకోవలసిందే. ఇంట్లో ఎవరో ఒకరికి ఆరోగ్య సమస్యలు సర్వసాధారణం. కనుక లాక్‌డౌన్‌ ఉన్నా మందులు, ఆసుపత్రులు, టెస్టుల కోసం రోడ్లపైకి వెళ్ళక తప్పని పరిస్థితి. అయితే లాక్‌డౌన్‌ వలన చిన్న చిన్న లాభాలు కూడా పొందుతున్నారు. మన దేశంలో ప్రతీ రెండు నెలలకు ఏదో ఓ పండుగ వస్తూనే ఉంటుంది. మద్యతరగతి ప్రజలకు ప్రతీ నెలా ఏదో శుభాశుభాకార్యాలకు పిలుపులు వస్తూనే ఉంటాయి. ఈ లాక్‌డౌన్‌ పుణ్యామని అవన్నీ తప్పించుకోగలుగుతున్నామని సంతోషిస్తున్నవారూ ఉన్నారు.

కరోనా కారణంగా దుకాణాలు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, నిర్మాణసంస్థలు అన్నీ మూతపడటంతో వాటిలో పనిచేసే చిన్న ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. సినీ పరిశ్రమ మూతపడగానే దానిలో పనిచేసే జూనియర్ ఆర్టిస్టులు, ఇతర సిబ్బంది అందరూ రోడ్డున పడ్డారు. ఇక పేదప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రోజువారీ కూలీలకు ఇప్పుడు పనులు లేవు. కనుక చేతిలో డబ్బు కూడా లేదు. కానీ కరోనా పుణ్యమాని నిత్యావసరవస్తువుల ధరలు పెరిగిపోతుండటంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితులు నెలకొన్నాయి. 

ఈవిధంగా దేశంలో ధనికపేద అనే బేధం లేకుండా ప్రజలందరూ భారంగానే రోజులు దొర్లిస్తున్నారు. ఈ కరోనా కష్టాలు ఇంకా ఎన్నాళ్ళు భరించాలో తెలియని పరిస్థితులు నెలకొని ఉండటంతో క్యా కరోనా? అనుకొంటూ ఆనాటి కరోనా ఊసు లేని మంచి రోజుల కోసం అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.


Related Post