భారత్‌ కరోనాను జయించగలదా?

March 23, 2020


img

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నప్పటికీ దేశంలో కరోనా కేసుల సంఖ్య మెల్లగా పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం ఉదయానికి దేశంలో 395 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు సమాచారం. వారిలో 27 మంది పూర్తిగా కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా భారత్‌లో ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 8 మంది మాత్రమే మరణించారు. 

130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశంలో ఇప్పటివరకు కేవలం 395 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవడం గమనిస్తే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అందుకే దేశంలో కరోనా వ్యాప్తి చాలా మెల్లగా సాగుతోందనూయి చెప్పవచ్చు. 

అదే ఇటలీ దేశంలోకి కరోనా ప్రవేశించిన తరువాత వారం రోజుల వ్యవధిలోనే కొన్ని వందలమందికి కరోనా వైరస్‌ సోకింది. కేవలం 4-5 వారాల వ్యవధిలోనే ఇటలీలో 59,138 కరోనా కేసులు నమోదుకాగా నేటి వరకు 5,476 మంది చనిపోయారు. అలాగే అగ్రరాజ్యమైన అమెరికాలో ఇప్పటివరకు 36,540 కేసులు నమోదుకాగా నేటి వరకు 458 మంది చనిపోయారు. స్పెయిన్‌లో 31,050 కేసులు, 1,854 మంది మృతులు, జర్మనీలో 25,549 కేసులు, 104 మంది మృతి చెందారు. కనుక అన్ని విధాలా అభివృద్ధి చెందిన అమెరికా, యూరోప్ దేశాలతో పోలిస్తే ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్న భారత్‌లో కరోనా వైరస్‌ అదుపు తప్పలేదని స్పష్టం అవుతోంది. 

కరోనా వైరస్‌ విదేశాల నుంచి వస్తున్న వారి ద్వారానే భారత్‌లోకి వస్తోందని గ్రహించిన వెంటనే, కేంద్రప్రభుత్వం విమానసర్వీసులను బంద్‌ చేసింది. పోర్టులను దిగ్బంధం చేసింది. దేశసరిహద్దులను పూర్తిగా మూసివేసింది. దేశంలో తొలిసారిగా ఆదివారంనాడు జనతా కర్ఫ్యూ విధించి దేశాన్ని స్తంభింపజేసింది. కరోనా వ్యాప్తికి దోహదపడుతున్న అన్ని రకాల ప్రజారవాణా వ్యవస్థలను మార్చి 31వరకు రద్దు చేసింది. నేటి నుంచి తొమ్మిది రోజులపాటు ఏపీ, తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నాయి. ఇటువంటి కీలక సమయంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలు, రాజకీయాలను పక్కనపెట్టి చక్కటి సమన్వయంతో పనిచేస్తుండటం చాలా శుభపరిణామం. కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పరీక్షా కేంద్రాల సంఖ్యను గణనీయంగా పెంచింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జిల్లాల వారీగా కరోనా ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసుకొంటున్నాయి. 

కరోనాను ఎదుర్కోవడంలో కూడా దేశంలో మిగిలిన రాష్ట్రప్రభుత్వాల కంటే తెలంగాణ ప్రభుత్వం ముందుండటం విశేషం. కరోనా తీవ్రతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ కింగ్ కోఠీ వద్దగల ప్రభుత్వాసుపత్రిని పూర్తిగా కరోనా స్పెషల్ ఆసుపత్రిగా మార్పు చేస్తోంది. నేటి నుంచి తెలంగాణతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను మరింత కటినంగా అమలుచేయబోతున్నాయి. 

ఇంత అసాధారణ స్థాయిలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టడం వలననే దేశంలో కరోనా వ్యాప్తికి బ్రేకులు పడ్డాయని చెప్పవచ్చు. భారత్‌లో కరోనా ప్రవేశిస్తే కట్టడిచేయడం కష్టమని భావించిన ఆగ్రదేశాలు, కరోనాను భారత్‌ కట్టడి చేస్తున్న తీరును చూసి ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాయి. అయితే కరోనాపై భారత్‌ ఇంకా విజయం సాధించలేదు. కనుక మరొక ఏడాదిపాటు ఇంతే అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. కరోనాను జయించిన దేశంగా భారత్‌ నిలవాలంటే భారతీయులందరూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తూ ఎంతో క్రమశిక్షణతో మెలగాల్సి ఉంటుంది.


Related Post