ఈసీ లేఖపై మరో వివాదం

March 19, 2020


img

ఏపీ ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖకు వ్రాసినట్లు చెప్పబడుతున్న లేఖపై సరికొత్త వివాదం మొదలైంది. అధికార వైసీపీ నేతల వలన తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణాపాయం ఉందని, కనుక కేంద్ర భద్రతదళాలతో తనకు భద్రత కల్పించాలని రమేష్ కుమార్ కేంద్రానికి లేఖ వ్రాశారు. అయితే దానిని ఆయన ఇంతవరకు దృవీకరించకపోవడంతో వైసీపీ నేతలు అది టిడిపి కుట్రే అయ్యుండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేవిధంగా ఉన్న ఆ లేఖను నిజంగా రమేష్ కుమారే వ్రాశారా లేక టిడిపి నేతలు దానిని సృష్టించారా? తెలుసుకోవడానికి విచారణ జరిపించాలని వైసీపీ నేతలు పట్టుబడుతున్నారు.

ఒకవేళ ఆయనే ఆ లేఖ వ్రాసి ఉండి ఉంటే దానిని దృవీకరించి ఉండాలి. ఒకవేళ ఆయన వ్రాయకపోయుంటే, తన పేరిట విడుదలైన ఆ లేఖను ఖండించి ఉండాలి. కానీ రమేష్ కుమార్ ఆ రెండు చేయలేదు. తనకు ప్రాణభయం ఉన్నట్లు రాష్ట్ర పోలీస్ డీజీపీకి కానీ పోలీస్ అధికారులకు గానీ ఇంతవరకు ఫిర్యాదు కూడా చేయకపోవడంతో వైసీపీ నేతలు ఆ లేఖపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఈ వివాదంపై రమేష్ కుమార్ స్పందించడం లేదు కానీ టిడిపి నేతలు స్పందిస్తుండటం విశేషం. రమేష్ కుమార్ స్వయంగా ఆ లేఖను వ్రాశారని, ఆయన తన సొంత ఈ-మెయిల్ ద్వారా దానిని కేంద్రప్రభుత్వానికి పంపించారని టిడిపి నేతలు చెపుతున్నారు. ఆయన తరపున టిడిపి నేతలు మాట్లాడుతుండటంతో వైసీపీ నేతలకు ఇంకా అనుమానాలు పెరుగుతున్నాయి. ఒకవేళ ఆ లేఖ తానే వ్రాసినట్లు రమేష్ కుమార్ దృవీకరిస్తే అప్పుడు వైసీపీ నేతలు ఆయనపై యుద్ధం ప్రకటించవచ్చు. ఒకవేళ ఆ లేఖతో తనకు సంబందం లేదని ఆయన చెపితే కమీషనర్ పేరిట నకిలీ లేఖను సృష్టించిన వారెవారైనా చాలా పెద్ద చిక్కుల్లో పడటం ఖాయం.


Related Post