నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుచేయగలరా?

March 18, 2020


img

నిర్భయకేసులో నలుగురు దోషులకు ఈనెల 20న ఉదయం 5.30 గంటలకు ఒకేసారి తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలుచేయవలసి ఉంది. కానీ వారి న్యాయవాదులు ఎంచుకొంటున్న మార్గాలను చూస్తుంటే, మన న్యాయవ్యవస్థ వారికి ఎప్పటికైనా ఉరిశిక్ష అమలుచేయగలదా? అనే సందేహం కలుగకమానదు. 

దోషులలో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ భార్య పునీతా సింగ్ తనకు భర్త నుంచి విడాకులు ఇప్పించవలసిందిగా కోరుతూ మంగళవారం ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. “నిర్ధోషి అయిన నా భర్తను అత్యాచారం కేసులో అన్యాయంగా ఇరికించి ఉరి తీయబోతున్నారు. ఆ కేసులో ఉరిశిక్ష పడిన వ్యక్తికి భార్యగా నేను సమాజంలో అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక నాకు విడాకులు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను,” అంటూ పిటిషన్‌లో కోరారు. ఆ పిటిషన్‌ను స్వీకరించిన ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్టు 19వ తేదీన విచారణ చేపట్టనుంది. 

ఆమె తరపున ఈ పిటిషన్‌ వేసిన న్యాయవాది ముఖేష్ కుమార్ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ, “హిందూ వివాహ చట్టంలోని సెక్షన్స్ 13(2)(11) ప్రకారం అత్యాచారకేసులో భర్త దోషి అని తేలితే భార్య విడాకులు పొందవచ్చు,” అని చెప్పారు. 

అయితే ఇది ఉరిశిక్షను నిరవదికంగా వాయిదా వేయించడానికేనని అర్ధమవుతూనే ఉంది. కానీ నిర్భయకేసు ముగిసి నలుగురు దోషులకు శుక్రవారం ఉరి తీయవలసి ఉంది కనుక ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్టు ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. చట్టప్రకారం పునీతా సింగ్‌కు భర్త నుంచి విడాకులు పొందే హక్కు కలిగి ఉన్నందున ఒకవేళ ఫ్యామిలీ కోర్టు ఆమె పిటిషన్‌పై విచారణ మొదలుపెడితే అది ఇప్పట్లో ముగిసే అవకాశమే ఉండదు. నిర్భయ దోషుల తరపు వాదిస్తున్న న్యాయవాదులు మన చట్టాలను, మన న్యాయవ్యవస్థను ఇంతగా అపహాస్యం చేస్తుంటే, మన న్యాయస్థానాలు ఏమి చేయలేని నిసహాయస్థితిలో ఉండటం చాలా బాధాకరమే. 


Related Post