విదేశీ నౌకలన్నీ సముద్రంలోనే...

March 17, 2020


img

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని దేశాలు అనేక కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నాయి. విశాఖపట్నంలో అతిపెద్ద నౌకాశ్రయం (పోర్ట్) ఉంది. కనుక విదేశాల నుంచి నిత్యం అనేక భారీ సరుకురవాణా నౌకలు వస్తుంటాయి. అలాగే విశాఖ నుంచి విదేశాలకు నిత్యం ఎగుమతులు జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ ఎగుమతులు, దిగుమతులపై కూడా కరోనా వైరస్‌ ప్రభావం కనిపిస్తోంది. 

విదేశాల నుంచి విశాఖకు వస్తున్న నౌకలపై నౌకాశ్రయం అధికారులు కొత్త ఆంక్షలు విధించారు. కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడానికి 14 రోజులు సమయం పడుతుందని వైద్యనిపుణులు చెపుతున్నారు. కనుక విదేశాల నుంచి బయలుదేరిన సరుకు రవాణా నౌకలు విశాఖ చేరుకోవడానికి 14 రోజులు లేదా అంతకంటే ఎక్కువైతే వాటిని నేరుగా నౌకాశ్రయంలోకి వచ్చేందుకు అనుమతిస్తున్నారు. 

అంతకంటే తక్కువ సమయంలో విశాఖకు చేరుకొంటున్న నౌకలను మాత్రం తీరానికి 10 నాటికల్ మైళ్ళ దూరంలో నిలిపివేయిస్తున్నారు. 14 రోజులు గడువు ముగిసే వరకు అవి సముద్రంలోనే ఉండాలి. గడువు తరువాత నౌకలలో కెప్టెన్ మొదలు సిబ్బంది అందరికీ ధర్మల్ స్క్రీనింగ్ చేసి కరోనా లేదని నిర్దారించుకొన్న తరువాతే నౌకలను నౌకాశ్రయంలోకి అనుమతిస్తున్నారు. కరోనా నేపధ్యంలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని అందరికీ తెలుసు. 

కానీ ఈ కరోనా ఆంక్షల వలన సదరు నౌకలను నిర్వహిస్తున్న సంస్థలకు భారీగా నష్టపోవడం ఖాయం. ఆ నష్టాన్ని పూడ్చుకొనేందుకు అవి సరుకు రవాణా చార్జీలను పెంచక తప్పదు. సరుకుల ధరలు పెరిగితే అంతిమంగా ఆ భారం భరించాల్సింది వినియోగదారులే. కనుక ఇక నుంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్న అన్ని రకాల సరుకుల ఛార్జీలు భారీగా పెరగడం అనివార్యమే. అదేవిధంగా భారత్‌ నుంచి ఇతరదేశాలకు ఎగుమతులకు కూడా కరోనా కష్టాలు, నష్టాలు, చార్జీల పెంపు తప్పవు. కనుక వివిద రంగాలపై కరోనా వైరస్‌ ప్రభావం పెరుగుతున్న కొద్దీ దేశాల ఆర్ధిక వ్యవస్థలపై కూడా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం పొంచి ఉంటుందని భావించవచ్చు. 


Related Post