నిర్భయ కేసులో నలుగురుగు దోషులకు ఉరికొయ్య కంటికి ఎదురుగా కనబడుతున్నప్పటికీ దేశంలో అత్యున్నత న్యాయస్థానాన్ని సైతం ముప్పతిప్పలు పెడుతుండటం చాలా ఆశ్చర్యకరమైన విషయమే. కానీ నిరుపేదలమని చెప్పుకొనేవారు ఇన్నేళ్ళుపాటు హైకోర్టు, సుప్రీంకోర్టులో వాదించడానికి పెద్ద పెద్ద లాయర్లను ఏవిధంగా ఏర్పాటు చేసుకోగలుగుతున్నారు?వారి లాయర్లకు ఇన్నేళ్ళుగా ఎవరు ఫీజులు చెల్లిస్తున్నారు? ఇప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడా కేసులు వేసి పోరాడగలిగే శక్తి వారికి ఏవిధంగా లభించింది?అనే సందేహాలు కలుగకమానవు. ఈ ప్రశ్నలకు సమాధానాలు మన రాజ్యాంగంలో లభిస్తాయి.
దోషులకు కూడా న్యాయపరమైన సహాయం అందించేందుకు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 39ఏ, లీగల్ సర్వీస్ ఆధారిటీ చట్టం-1987 ద్వారా అవకాశం కల్పించింది. కనుక నిర్భయ దోషులకు కూడా న్యాయస్థానాలే న్యాయవాదులను ఏర్పాటు చేస్తున్నాయి.
అంటే నిర్భయ కేసులో వారిని దోషులుగా నిరూపించేందుకు జరిగే విచారణకు అయ్యే న్యాయవాదులు, కోర్టు ఖర్చులను, అలాగే వారికి ఉరిశిక్ష పడకుండా అడ్డుకొనేందుకు వాదిస్తున్న న్యాయవాదులకు కూడా ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందని అర్ధమవుతోంది. అంటే కరడుగట్టిన ఉగ్రవాదులను ఏళ్ళ తరబడి జైల్లో పోషించడమే కాక వారు శిక్షల నుంచి తప్పించుకోవడానికి కూడా ప్రజల కష్టార్జితంతో చెల్లిస్తున్న పన్నుల ద్వారా వచ్చే ప్రజాధనాన్ని వినియోగించబడుతోందన్న మాట!