రజనీకాంత్ దరఖాస్తు తీసుకొన్నా వార్తే!

March 07, 2020


img

ప్రముఖ నటుడు రజనీకాంత్‌ ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తానని చాలా కాలంగా చెపుతున్నారు కానీ ఆఖరు నిమిషంలో ఏదో సాకుతో ఆ ప్రయత్నం విరమించుకొంటున్నారు. కానీ వచ్చే ఏడాది జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని రజనీకాంత్‌ చెప్పడంతో ఆయన అభిమానులు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఆయన ప్రతినిధి ఒకరు డిల్లీలో కేంద్ర ఎన్నికల కమీషన్‌ నుంచి పార్టీ ఏర్పాటు చేయడానికి దరఖాస్తు తీసుకొన్నట్లు తెలియడంతో తమిళ మీడియాలో రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం గురించి వార్తలు, చర్చలు, విశ్లేషణలు మొదలైపోయాయి. రజనీకాంత్‌ దరఖాస్తు తీసుకొన్నారు కానీ ఈసారైనా దానిని నింపి కేంద్ర ఎన్నికల కమీషన్‌కు సమర్పిస్తారో లేదో చూడాలి. 

దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మరణంతో తమిళనాడు రాజకీయాలలో ఏర్పడిన రాజకీయశూన్యతను అవకాశంగా మలుచుకోవాలని రజనీకాంత్‌ ఆలోచనలు చేస్తూ కాలక్షేపం చేస్తుండగానే, ఆయన సహనటుడు కమల్ హాసన్‌ మక్కల్ నీది మయ్యం పార్టీతో పెట్టి ప్రజలలోకి దూసుకుపోయారు. కానీ గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆయన పార్టీ ఘోరపరాజయం పాలైంది. దాంతో రజనీకాంత్‌ రాజకీయ ఆలోచనలకు బ్రేక్ పడింది. కానీ మళ్ళీ ఇప్పుడు రాజకీయ ప్రవేశానికి సిద్దం అవుతున్నారు. 

రజనీకాంత్‌ ఓసారి బిజెపికి అనుకూలంగా మాట్లాడి ఆ పార్టీతో జత కట్టబోతున్నట్లు సంకేతాలు ఇస్తారు. మరోపక్క బిజెపిని వ్యతిరేకిస్తున్న కమల్ హాసన్‌తో చేతులు కలుపుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు ఎవరితోనూ చేతులు కలపకుండా ఒంటరిగానే పోటీ చేస్తారని ఆయన అభిమానులు చెపుతున్నారు. కనుక రజనీకాంత్‌ అసలు పార్టీని ఏర్పాటు చేస్తారా లేదా? చేస్తే ఏవిధంగా ముందుకు సాగుతారు? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు లభించవచ్చు. 

అయితే సినీ అభిమానులను నమ్ముకొని పార్టీ పెడితే ఏమవుతుందో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, కమల్ హాసన్‌ ద్వారా ఇప్పటికే తెలిసింది. అయినా రజనీకాంత్‌ కూడా స్వయంగా తన అదృష్టం పరీక్షించి చూసుకోవాలనుకొంటున్నారు. కనుక ఆయన రాజకీయాలలో విజయం సాధిస్తారా లేదా అనే విషయం పార్టీ పెట్టి, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తే గానీ తెలియదు.


Related Post