కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి అరెస్ట్

March 05, 2020


img

మల్కాజగిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి ఈరోజు మళ్ళీ అరెస్ట్ అయ్యారు. ఆయన డిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకోగానే అక్కడ ఆయన కోసం ఎదురుచూస్తున్న పోలీసులు ఆయనను అదుపులో తీసుకొని నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రేవంత్‌ రెడ్డితో పాటు ఆయన అనుచరులు 8 మందిపై నార్సింగి పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిలో ఐదుగురిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

మూడు రోజుల క్రితం వారందరూ గండిపేటలో మంత్రి కేటీఆర్‌ ఫామ్ హౌస్ ముట్టడికి బయలుదేరినప్పుడు, రేవంత్‌ రెడ్డి పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో కేటీఆర్‌ ఫామ్ హౌసును చిత్రీకరించినందుకు అరెస్ట్ చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్స్ 184,187,11 రెడ్ విత్ 5ఏ కింద కేసులు నమోదు చేశారు. అనంతరం పోలీసులు రేవంత్‌ రెడ్డిని గోల్కొండ వద్ద గల ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించారు. అక్కడి నుంచి నేరుగా ఉప్పర్ పల్లి మేజిస్ట్రేట్ నివాసానికి తీసుకువెళ్ళారు. ఆయన రేవంత్‌ రెడ్డి అనుచరులకు 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు వారినందరినీ చర్లపల్లి జైలుకు తరలించారు. 

అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా ఎగురవేసినందుకు ఒక ఎంపీని అరెస్ట్ చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. రేవంత్‌ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఖండించారు. తెలంగాణ ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని రేవంత్‌ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు ఇదే తాజా నిదర్శనమని కాంగ్రెస్‌ నేతలు వాదిస్తున్నారు. 


Related Post