టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదుగగలదా?

March 02, 2020


img

ఎన్నికలకు ముందు రాజకీయ నాయకులు పార్టీలు ఫిరాయిస్తుండటం సాధారణ విషయమే. అలాగే కాంగ్రెస్‌, బిజెపి జాతీయనాయకులు రాష్ట్రంలో పర్యటించేముందు కూడా ఆ పార్టీల నేతలు ఇతర పార్టీల నేతలను, కార్యకర్తలను తమ పార్టీలలోకి ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈనెల 15న కేంద్రహోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌ రానున్నారు. సీఏఏను సమర్ధించుకొంటూ ఎల్బీ స్టేడియంలో జరుగబోయే బహిరంగసభలో పాల్గొనేందుకు ఆయన వస్తున్నారు. కనుక రాష్ట్ర బిజెపి నేతలు కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ నేతలను తమ పార్టీలోకి ఆకర్షించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. 

ఆ ప్రయత్నాలలో భాగంగానే బిజెపిలో చేరిన టిఆర్ఎస్‌ వనస్థలిపురం వార్డు కమిటీ సభ్యురాలు నాగినేని కృష్ణవేణికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ కాషాయకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమిత్ షా బహిరంగసభను విజయవంతం చేయడానికి పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బిజెపిని బలోపేతం చేసుకోవడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. 

టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదగాలంటే ఈవిధంగా వార్డు సభ్యులను పార్టీలో చేర్చుకుంటే సరిపోదు. ముందుగా ప్రజల నమ్మకాన్ని పొందాలి. కానీ టిఆర్ఎస్‌, బిజెపిల మద్య మంచి అవగాహన ఉందని అనుమానం కలిగేలా ఆ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రజలు బిజెపిని  ఎన్నటికీ విశ్వసించకపోవచ్చు. రాష్ట్రపతి భవన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ గౌరవార్ధం ఇచ్చిన విందుకు డిల్లీలోనే ఉన్న డిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ను, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, జగన్‌మోహన్‌రెడ్డి వంటివారిని ఆహ్వానించని కేంద్రప్రభుత్వం సిఎం కేసీఆర్‌ను ఆహ్వానించడం అందుకు తాజా నిదర్శనం. కనుక టిఆర్ఎస్‌-బిజెపిల మద్య అవగాహన ఉందని ప్రజలకు అనుమానాలు కలగడం సహజం. కనుక బిజెపి పట్ల ప్రజలలో ఆ అనుమానాలు ఉన్నంతకాలం తెలంగాణలో బిజెపి టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగడం కష్టమే. ఈ విషయం వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికలలో నిరూపితమైంది. అయినా బిజెపి గ్రహించకపోవడం ఆశ్చర్యకరమే.


Related Post