కేసీఆర్‌లో ఈ మానవతాకోణాన్ని చూశారా?

February 28, 2020


img

తెలంగాణ సిఎం కేసీఆర్‌ వర్తమాన రాజకీయనాయకులలో విభిన్నమైనవారు. ఇతర ముఖ్యమంత్రులకు భిన్నంగా ఆయనలో రాష్ట్రం పట్ల...ప్రజల పట్ల తపన, మానవతాకోణం, ప్రకృతి పట్ల ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంటాయి. అందుకే కొన్ని సమస్యలపై ఆయన స్పందించే తీరు విభిన్నంగా ఉంటుంది. ఆయనలో మానవతాదృక్పదానికి అద్దంపట్టే ఘటన ఒకటి నిన్న జరిగింది. 

సిఎం కేసీఆర్‌ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని టోలీచౌకీలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా, దారిలో ఒక వృద్ధుడు చేతిలో ఏదో కాగితం పట్టుకొని ఎండలో వెళుతూ కనిపించాడు. సిఎం కేసీఆర్‌ వెంటనే కారులో నుంచి దిగి అతని దగ్గరకు వెళ్ళి ప్రేమగా పలకరించి అతని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 

అతని పేరు మహ్మద్ సలీం. డ్రైవరుగా పనిచేసే అతను ఓ ప్రమాదంలో ఓ కాలు కోల్పోయాడు. అప్పటి నుంచి అతని కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. చేతికి అందివస్తాడనుకొన్న కొడుకు అనారోగ్యం పాలవడంతో అతనికి వైద్యం చేయించలేకపోతున్నారు. అష్టకష్టాలు పడుతున్న మహ్మద్ సలీం వృద్ధాప్య పింఛనుకోసం దరఖాస్తు చేసుకొనేందుకు వెళుతుండగా సిఎం కేసీఆర్‌ దేవుడిలా ప్రత్యక్షమవడం అతని అదృష్టమే అనుకోవాలి. సిఎం కేసీఆర్‌ మహ్మద్ సలీం సమస్యలన్నిటినీ చిటికలో పరిష్కరించారు. 

అక్కడికక్కడే ఆయనకు పెన్షన్, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేయాలని హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతిని ఆదేశించారు. సలీం, అతని కొడుకు వైద్యచికిత్సకు అవసరమైన ఆర్ధికసాయం అందించాలని ఆదేశించారు. 

తన జీవితంలో ఎప్పుడూ కష్టాలు కన్నీళ్ళే తప్ప ఏనాడూ సంతోషం ఉండదని దిగులుచెందుతున్న సలీం, అడగకనే ఇన్ని వరాలు ఇచ్చిన సిఎం కేసీఆర్‌ చేతులు పట్టుకొని ఆనందబాష్పాలతో అభిషేకం చేశాడు. పదేపదే సిఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అల్లా ఎప్పుడూ మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకొన్నాడు. 

సిఎం కేసీఆర్‌ హటాత్తుగా కారులో నుంచి దిగడంతో ఏమి జరిగిందో అని ఆందోళన చెందిన ఆయన భద్రతా సిబ్బంది, అధికారులు, ఆ రోడ్డున పోతున్నవారు సిఎం కేసీఆర్‌ దారినపోయే ఓ వృద్దుడి పట్ల ఇంత మానవత్వం ప్రదర్శించడం చూసి సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయారు. సిఎం కేసీఆర్‌పై మీడియా ప్రశంశల వర్షం కురిపించింది. సిఎం కేసీఆర్‌కు నెటిజన్స్ జేజేలు పలుకుతున్నారు. 

సిఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లా కలక్టర్ శ్వేతా మహంతి అధికారులతో కలిసి గురువారం మధ్యాహ్నమే మహ్మద్ సలీం ఇంటికి వెళ్ళి అతని పూర్తివివరాలు తీసుకొని వెంటనే వృద్ధాప్య పింఛన్, జియాగూడలో ఓ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేశారు. సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి వారిరువురి వైద్యఖర్చులకు ఆర్ధిక సాయం అందించబోతున్నారు. 



Related Post