అన్ని వైపులా సత్సంబంధాలు ఉంటేనే ప్రగతి!

August 13, 2016


img

ఒకప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ వాటి మధ్య సంబంధాలు గొప్పగా ఉండేవి కావు. రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులకి గౌరవం అంతంత మాత్రం గానే ఉండేది. నిధుల విడుదల, పెండింగ్ ప్రాజెక్టుల క్లియరెన్స్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి పెద్దగా సహకరించేది కాదు. రాష్ట్ర రాజకీయాలపై చూపిన శ్రద్ద రాష్ట్రాభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం చూపేది కాదు. ఆ కారణంగా రాష్ట్రాలు నత్తనడకన అభివృద్ధి సాగేది. కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధాలు చాలా మెరుగుపడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ వంటి కొన్ని చోట్ల తప్ప దేశంలో మిగిలిన రాష్ట్రాలలో ఇతర పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ వాటితో కేంద్ర ప్రభుత్వం స్నేహ పూర్వకంగానే వ్యవహరిస్తోంది. ఉదారంగా నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేస్తూనే ఉంది. గత రెండేళ్ళలో రెండు తెలుగు రాష్ట్రాలకి మంజూరు అయిన నిధులు, ప్రాజెక్టులు చూసినట్లయితే ఆ సంగతి అర్ధం అవుతుంది.

కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళలో మంజూరు చేయలేని ప్రాజెక్టులని మోడీ ప్రభుత్వం కేవలం రెండేళ్ళలోనే రెండు తెలుగు రాష్ట్రాలకి మంజూరు చేసింది. ఇంకా చేస్తోంది కూడా. ముఖ్యంగా రాష్ట్ర విభజన కారణంగా చితికిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెండేళ్ళలో అనేక ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటు చేసింది. భారీగా నిధులు మంజూరు చేసింది. అయినప్పటికీ ప్రత్యేక హోదా వంటి కొన్ని హామీలని అమలు చేయని కారణంగా కొంత అసంతృప్తి నెలకొని ఉంది. అది వేరే విషయం. దీన్ని బట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగున్నాయని, రాష్ట్రాలతో కేంద్రం స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోందని స్పష్టం అవుతోంది.

ఆ విషయాన్నీ తెలంగాణ సిఎం కెసిఆర్ కూడా అంగీకరించారు. గజ్వేల్ సభాముఖంగా దృవీకరించారు కూడా. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆయన రాష్ట్రంలో ప్రతిపక్షాలతో అదే విధంగా వ్యవహరిస్తున్నారా? పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో అదే విధంగా సహకరిస్తున్నారా? అంటే లేదనే చెప్పక తప్పదు.

నదీ జలాలు, ఉద్యోగులు, నిధులు వగైరా పంపకాలు, హైకోర్టు విభజన వంటి సమస్యలు, టిడిపి-టిఆర్ఎస్ రాజకీయ విభేధాల కారణంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకోవడం లేదని సరిపెట్టుకోవచ్చు. కానీ ఎప్పటికీ ఇదే విధంగా కీచులాడుకోవడం మంచిదేనా? ఇద్దరు ముఖ్యమంత్రులు తమకి జాతీయ దృక్పధం ఉందని చాలా గొప్పగా చెప్పుకొంటుంటారు కానీ ఒకరికొకరు సహకరించుకోరు!

ఇక ఏపిలో జగన్మోహన్ రెడ్డి నుంచి టిడిపి గట్టి సవాలు ఎదుర్కొంటోంది కనుక వైసిపిని నిర్వీర్యం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కానీ తెలంగాణలో టిఆర్ఎస్ కి ఎదురే లేదని రుజువు అయిన తరువాత కూడా కెసిఆర్ ప్రభుత్వం ప్రతిపక్షాలని నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బ తీయడం సబబేనా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో విభిన్న పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ సఖ్యతగా ఉండగలుగుతున్నప్పుడు, ఇరుగుపొరుగు రాష్ట్రాలు, రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలు ఎందుకు కలిసికట్టుగా పనిచేయడానికి ఇష్టపడటం లేదు? అందరి లక్ష్యం రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమమే అయినప్పుడు అందరూ కలిసికట్టుగా ఎందుకు పనిచేయడానికి ఇష్టపడటం లేదు అనే విషయాలు ఆలోచించుకోవాలి.


Related Post