భారత్‌ కూడా ఆ ఊబిలోకి ఎందుకు దిగడం?

February 26, 2020


img

ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో రష్యా పాగా వేసినప్పుడు దానిమీద పట్టు సాధించడానికి అమెరికాయే తాలిబన్లను సృష్టించి వారికి ఆయుధాలు అందించింది. అమెరికా ఎత్తుగడ ఫలించి రష్యా తోకముడిచి వెనక్కు వెళ్లిపోయింది. కానీ అమెరికా సృష్టించిన తాలిబన్లు అమెరికా అందించిన ఆయుధాలతో అమెరికానే ఎదిరించడం మొదలుపెట్టడంతో అమెరికా సైనికులు దశాబ్ధాలుగా తాలిబన్లతో యుద్దం చేశారు. వేలాదిమంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చివరికి బిన్ లాడెన్ అమెరికా ట్విన్ టవర్స్ మీదే దాడిచేయించాడు. దాంతో ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా-తాలిబన్ల మద్య దశాబ్ధాలుగా సాగిన యుద్ధంలో వేలాదిమంది ఆఫ్ఘనిస్తాన్‌ ప్రజలు చనిపోయారు. ఆ దేశం సర్వనాశనం అయిపోయింది.      చివరికి ఆఫ్ఘనిస్తాన్ అంటే తాలిబన్ల దేశమనుకొనే స్థితికి దిగజారింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇంకా యుద్ధం కొనసాగించడం వలన ఇంకా అమెరికన్ సైనికులను కోల్పోవలసి వస్తుందని, అక్కడ యుద్ధం కొనసాగించడానికి ఏటా బిలియన్ల డాలర్లు ఖర్చు చేయవలసి వస్తోందని గ్రహించిన డొనాల్డ్ ట్రంప్, ఇప్పటి వరకు ఏ తాలిబన్లతో యుద్ధం చేశారో ఇప్పుడు వారితోనే ట్రంప్ ప్రభుత్వం ‘శాంతి ఒప్పందం’ చేసుకోవడానికి సిద్దపడుతుండటం విశేషం. 

ప్రపంచ దేశాలలో శాంతి నెలకొల్పడానికి అమెరికా నిత్యం యుద్ధాలు చేస్తూ రక్తం ఏరులై పారిస్తుంటే, భారత్‌ మాత్రం ఆఫ్ఘనిస్తాన్‌ దయనీయ పరిస్థితులను చూసి కోట్లాదిరూపాయలు వెచ్చించి ఆఫ్ఘనిస్తాన్‌ పునర్నిర్మాణానికి పూనుకొంది. భారత్‌ స్వచ్ఛందంగా చేస్తున్న ఆ అభివృద్ధి కార్యక్రమాలకు అమెరికా ఏనాడూ తోడ్పడనప్పటికీ, ఇప్పుడు తాలిబన్లతో శాంతి ఒప్పందానికి భారత్‌ కూడా సహకరించాలని డొనాల్డ్ ట్రంప్ కోరడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దశాబ్ధాలుగా తాలిబన్లతో పోరాడుతూ ఆలిసిపోయి, ఆ ఉగ్రవాద ఊబిలో కూరుకుపోయిన అమెరికా, భారత్‌ను కూడా ఇప్పుడు దానిలోకి లాగాలనుకొంటున్నట్లుంది. ట్రంప్ కు ఘనంగా అతిధి మర్యాదలు చేసినందుకు ఆయన భారత్‌కు చేసే మహోపకారం ఇదేనా?


Related Post