అమరావతి రైతులకు కేంద్రం షాక్

February 04, 2020


img

ఏపీ రాజధాని అమరావతికి బదులు వైజాగ్, అమరావతి, కర్నూలులో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. లోక్‌సభలో టిడిపి ఎంపీ గలా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్రహోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 

2015లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసి, ఉత్తర్వులు కూడా జారీ చేసిందని తెలిపారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతున్నట్లు మీడియా ద్వారానే తెలిసిందని పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలో ఎక్కడైనా రాజధానిని ఏర్పాటుచేసుకొనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా తెలియజేశారు. 

రాజధాని తరలింపును రాష్ట్ర బిజెపి నేతలు వ్యతిరేకిస్తున్నారు కనుక ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకొని అడ్డుకొంటుందని టిడిపి, జనసేన, వామపక్షాలు, అమరావతి రైతులు ఆశపడుతున్నారు. కానీ ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని తేల్చిచెప్పడంతో బహుశః వారందరూ తీవ్ర నిరాశ చెంది ఉండవచ్చు. ఇక విశాఖకు రాజధానిని తరలించేందుకు సిద్దంగా ఉన్న జగన్ ప్రభుత్వానికి ఇది చాలా ఆనందం, ఉత్సాహం కలిగించే వార్తే. ఈ విషయంలో రాష్ట్ర బిజెపి నేతలు ఒక మాట, కేంద్రం మరోమాట చెప్పడంతో రాష్ట్రంలో బిజెపిపై ప్రజలు నమ్మకం కోల్పోవచ్చు. అమరావతి తరలింపును అడ్డుకోవాలనే ఉద్దేశ్యంతోనే బిజెపితో జతకట్టినందుకు జనసేనకు కూడా భంగపాటు తప్పలేదు.


Related Post