రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష...దేనికి?

February 03, 2020


img

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రాలకు నిధులు కేటాయించకపోవడంతో బిజెపియేతర రాష్ట్రాలు కేంద్రం వైఖరిని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. రాష్ట్రాల నుంచి పన్నుల రూపేణా కేంద్రానికి సమకూరుతున్న ఆదాయంలో ప్రధానంగా గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచే ఎక్కువ వస్తోంది. కానీ దానిలో తెలంగాణకు న్యాయంగా రావలసిన వాటాను కేంద్రం విడుదల చేయడంలేదని, పైగా రాష్ట్రానికి ఇస్తామని చెప్పినదానిలో కూడా కేంద్రం కోత విధిస్తోందని, అది కూడా సకాలంలో విడుదల చేయకపోవడంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతోందని సిఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దానివలన రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయే ప్రమాదం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం  చేశారు. 

ఎన్నికలు, బిజెపి రాజకీయ అవసరాలు, ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని కేంద్రప్రభుత్వం నిధులు కేటాయించడం సరికాదనే చెప్పాలి. గతంలో యూపీ, బీహార్, జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలప్పుడు వాటికి అడగకుండానే కేంద్రం చాలా భారీగా నిధులు, పధకాలు ప్రకటించింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మౌలికవసతుల కల్పన, అభివృద్ధి, సంక్షేమ, కార్యక్రమాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు. కనుక టిఆర్ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేయడం సహజమే. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతూ కేంద్రానికి అత్యదిక ఆదాయం సమకూర్చుతున తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తే దేశాభివృద్ధి, ఆర్ధికాభివృద్ధి జరుగుందనే సంగతి కేంద్రం గ్రహించడంలేదని సిఎం కేసీఆర్‌ గతంలోనే నొక్కి చెప్పారు. కానీ యధాప్రకారం బడ్జెట్‌లో రాష్ట్రాన్ని పట్టించుకోలేదు. 

అయితే ఈ విషయంలో పూర్తిగా కేంద్రన్నే తప్పు పట్టలేము. రాష్ట్రాలలో జాతీయ, ప్రాంతీయపార్టీలు రెండూ కూడా ఎన్నికలలో గెలిచి అధికారం చేజిక్కించుకొనేందుకు..అధికారాన్ని నిలుపుకొనేందుకు ఆచరణ సాధ్యంకాని అనేక వరాలు, పధకాలు ప్రకటిస్తుంటాయి. అలాగే అవసరమైనవాటితో పాటు కొన్ని అనవసరమైన వాటిని కూడా తలకెత్తుకొంటాయి. 

ఉదాహరణకు తెరాస సర్కార్‌ రైతుబంధు పధకంలో ఆ సాయం ఏమాత్రం అవసరంలేని కోటీశ్వరులకు, భూస్వాములు, రాజకీయనాయకులు, ప్రముఖులకు కూడా రైతులతో పాటు సాయం అందిస్తోంది. నిజానికి దాంతో రాష్ట్రంలో పేద రైతుల కంటే వారే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. ఆ పధకం పేరు చెప్పుకొని టిఆర్ఎస్‌ ఓట్లు ఆడగుతుండటం అందరికీ తెలుసు. ఇవన్నీ ప్రజల కోసమే చేస్తున్నప్పటికీ వాటితో రాజకీయలబ్ది కూడా ఆశిస్తుంటామని సిఎం కేసీఆర్‌ స్వయంగా శాసనసభలో చెప్పారు. కనుక అధికార పార్టీలు ఆ క్రెడిట్‌ను పూర్తిగా సొంతం చేసుకోవాలనే అనుకొంటాయి తప్ప కేంద్రానికి కూడా ఆ క్రెడిట్‌లో వాటా ఇవ్వాలనుకోవు. మరి దానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని నిందించడం సరికాదు కదా?     

ఇది ఒక టిఆర్ఎస్‌కో లేదా తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన విషయం కాదు. అన్ని రాష్ట్రాలలో అధికార పార్టీలు ఇంచుమించు ఇలాగే వ్యవహరిస్తుంటాయి. ఈవిధంగా దేశంలో 29 రాష్ట్రాలలో పార్టీలు తమ రాజకీయప్రయోజనాల కోసం ప్రజలకు వరాలు ప్రకటించేసి, భారీ ప్రాజెక్టులు, పధకాలు మొదలుపెట్టి వాటన్నిటికీ కేంద్రమే నిధులు సమకూర్చాలని  కోరుతుంటే అవి అడిగినంతా నిధులు కేటాయించడం సాధ్యమేనా? అంత డబ్బు కేంద్రం మాత్రం ఎక్కడి నుంచి తేగలదు? ఒకవేళ కేంద్రం వద్ద అంత సొమ్ముపోగుపడి ఉండి ఉంటే అది రాష్ట్రాల పన్నుల వాటాలో కోతలు విధించి ఉండేదికాదు కదా? 

కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా రాజకీయాలకు అతీతంగా ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తూ పనిచేసినప్పుడే ఈ సమస్య తలెత్తదు. కానీ మన దేశంలో తుమ్మినా..దగ్గినా కూడా రాజకీయకోణంలో నుంచే చూడటం అన్ని పార్టీలకు అలవాటు కనుక ఈ సమస్యకు ఎప్పటికీ పరిష్కారం లభించదు. కనుక ఈవిధంగా పరస్పరం నిందించుకొంటూనే ఉంటారు.


Related Post