ఈ నెలాఖరుకి దుర్గంచెరువు కేబిల్ బ్రిడ్జ్ సిద్దం?

February 01, 2020


img

హైదరాబాద్‌ నగరానికి సరికొత్త ఆకర్షణగా నిలువబోతున్న దుర్గంచెరువు కేబిల్ బ్రిడ్జ్ నిర్మాణపనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఈ నెలాఖరులోగా మిగిలిన పనులన్నిటినీ పూర్తి చేసి మార్చిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే బంజారాహిల్స్ నుంచి దుర్గంచెరువు మీదుగా నేరుగా హైటెక్ సిటీ చేరుకోవచ్చు. బ్రిడ్జి ప్రధాననిర్మాణపనులన్నీ పూర్తయిపోయాయి. బ్రిడ్జిపై రోడ్డు నిర్మాణం, ఇరువైపులా రైలింగ్, లైటింగ్, సుందరీకరణ పనులు చురుకుగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు.    

రూ.184 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న దుర్గంచెరువు కేబిల్ బ్రిడ్జ్ మన దేశంలోఉన్న వాటికంటే పొడవైనది. అయినప్పటికీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం 22 నెలలలోనే పూర్తి చేయబోతున్నారు. దీని క్రింద దుర్గం చెరువులో పెరుకుపోయిన చెత్తాచెదారం అంతా తొలగించి నీళ్ళలో తేలియాడే ఫ్లోటింగ్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే దుర్గంచెరువుకు ఇరువైపులా పచ్చని చెట్లు, జాగింగ్ ట్రాక్, పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. కనుక దుర్గం చెరువు.. దానిపై తీగలతో వ్రేలాడుతున్న పొడవాటి కేబుల్ బ్రిడ్జి హైదరాబాద్‌ నగరానికి సరికొత్త పర్యాటక ఆకర్షణగా నిలువబోతున్నాయిని భావించవచ్చు.


Related Post