తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు శుభవార్త

February 01, 2020


img

తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు ఓ శుభవార్త. అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ ఇచ్చిన హామీ మేరకు వారి పదవీవిరమణ వయసును 58 నుంచి 61 సం.లకు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తాజా సమాచారం. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దీనిని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల మునిసిపల్ ఎన్నికల తరువాత సిఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌లో ఈ హామీ గురించి కూడా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. త్వరలో జరుగబోయే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలుపబోతున్నట్లు సమాచారం. 

పదవీ విరమణ వయసును 61 ఏళ్ళకు పెంచినట్లయితే ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31లోగా మొత్తం 26,133 మంది ఉద్యోగులు రిటైర్ కావలసి ఉంది. కానీ ఇప్పుడు ఇది అమలులోకి వస్తే వారందరికీ మరో మూడేళ్ళు పనిచేసేందుకు అవకాశం లభిస్తుంది. మరో మూడేళ్ళ వరకు ఎవరూ రిటైర్ అవరు కనుక ప్రభుత్వం వారికి చెల్లించవలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అంతవరకు చెల్లించనవసరం ఉండదు. అది ఏడాదికి సుమారుగా రూ.3,500 కోట్లు వరకు ఉంటుందని ఆర్ధికశాఖ అధికారులు అంచనా వేశారు. ఆ లెక్కన మూడేళ్లకు కలిపి రూ.10,500 కోట్లు ప్రభుత్వానికి మిగిలినట్లే! కనుక పదవీ విరమణ వయసును 61 ఏళ్ళకు పెంచడం వలన ఇటు ప్రభుత్వంపై ఆర్ధికభారం పడదు అటు ఉద్యోగులు కూడా చాలా సంతోషిస్తారు. కానీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగయువతకు మాత్రం ఇది చాలా నిరాశ కలిగించే విషయమే. 


Related Post