గజ్వేల్ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని మోడీని, కేంద్రమంత్రుల్ని స్తుతించిన తీరు చూస్తే చంద్రబాబు కూడా అయన ముందు తీసికట్టే అనిపిస్తుంది. తన పొగడ్తలు మోడీకి, కేంద్రమంత్రులకి సరిగ్గా అర్ధం కావడం కోసమే కెసిఆర్ హిందీలో ప్రసంగించారు.
ఇంతవరకు తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని తెరాస ఆరోపిస్తుండేది. కానీ కెసిఆర్ మాత్రం కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని, రాష్ట్రానికి రూ.70,000 కోట్లు ఇచ్చిందని, కేంద్ర ప్రభుత్వం సహాకారం వల్లనే రాష్ట్రంలో 1,300 కిమీ జాతీయ రహదారులు నిర్మించుకొన్నామని చెప్పారు. రెండేళ్లుగా అవినీతి రహితంగా పాలన చేస్తున్నందుకు, కేంద్ర ఆదాయంలో రాష్ట్రాలకి వాటా పంచి ఇస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోడీ పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని పొగిడేశారు. అలాగే మోడీతో సహా అందరినీ పనిగట్టుకొని పేరుపేరునా పొగిడారు. మాకు మీ డబ్బు వద్దు ప్రేమాభిమానాలు ఇస్తే చాలు అని అన్నారు. ఆ తరువాత మోడీ కూడా ఇంచుమించు అదే రేంజులో కెసిఆర్ ని పొగిడేశారు. అది చూసి, తెరాస-భాజపాలు చేతులు కలిపినట్లేనని మీడియాలో ఒకవర్గం నిర్ధారించేసింది. కానీ హైదరాబాద్ సభ తరువాత ‘తొందరపడి ఒక కోయిల ముందే కూసింది,” అన్నట్లయ్యాయి ఆ ఊహాగానాలు.
గజ్వేల్ నుంచి హైదరాబాద్ రాగానే మోడీతో సహా రాష్ట్ర భాజపా నేతల ట్యూన్ పూర్తిగా మారిపోయింది. ఆ సభలో తెరాస ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కెసిఆర్ కి వ్యతిరేకంగా మోడీ ఏమీ మాట్లాడలేదు కానీ డా.లక్ష్మణ్ తో సహా రాష్ట్ర భాజపా నేతలు అందరూ కెసిఆర్ ని దుమ్మెత్తిపోస్తుంటే మోడీ మౌనంగా ఉండిపోయారు. అంతా విన్న తరువాత “తెలంగాణలో భాజపా బలపడేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి” అని క్లుప్తంగా తన అభిప్రాయం చెప్పేశారు. అంటే తెరాసకి ప్రత్యామ్నాయంగా భాజపా నిలుస్తుందని లేదా నిలవాలని కోరుకొంటున్నట్లు ఆయన చెప్పేశారు.
కనుక గజ్వేల్ సభలో గుభాళించినవి కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలే. హైదరాబాద్ సమావేశంలో భాజపా వెలువరిచిన అభిప్రాయాలే అసలైనవని చెప్పవచ్చు. అందుకే “ప్రభుత్వాలుగా సహకరించుకొంటాము..పార్టీలుగా పనిచేసుకొనిపోతామని” తెరాస ఎంపి కవిత చెప్పారేమో?