బాబే నా ప్రాణం, ఆయనకే నా బాణం అంటున్న జగన్!

August 05, 2016


img

ఆనాడు రామాయణ కాలంలో...ఆ తరువాత చాలా యుగాల వరకు హనుమంతుల వారు నిత్యం రామ నామస్మరణ చేసేవారట! అందులోనే ఆయన తన్మయత్వం చెందేవారట! ఆయనే కాదు ఎవరు రామనామ స్మరణ చేసినా చాలా సంతోషపడిపోయి అడగకుండానే వరాలు ఇచ్చేసేవారట! ఇవన్నీ ఎవరూ స్వయంగా చూడలేదు కనుక అన్నిటికీ ‘ట’ పెట్టుకొని దానిని మన నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ చేయక తప్పదు. కానీ ఇప్పుడు అటువంటి సందేహాలేవీ లేకుండా ఈ జనరేషన్ లో కూడా అటువంటి నామస్మరణ (భజన) కార్యక్రమాన్ని మనం కళ్ళార చూడడమే కాదు, చెవులారా వినొచ్చు కూడా.  

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీల చెక్క భజన నేటికీ మన చెవులలో మార్మోగుతూనే ఉంటుంది. కాంగ్రెస్, బిజెపిలు బెంచీలు మార్చుకొన్న తరువాత ఇప్పుడు మోడీ భజన చాలా హై వాల్యూంలో వినబడుతోంది.

ఇక తెలుగు రాష్ట్రాలకి వచ్చేస్తే ఇక్కడ కెసిఆర్, కెటిఆర్, కవితల పేర్లు అప్పుడప్పుడు హరీష్ రావు భజన పాటలు మనకి వినిపిస్తుంటాయి. ఆంధ్రలో... న్యాచురల్లీ, చంద్రబాబు నాయుడు భజన పాటలు హోరెత్తిపోతున్నాయి. టిడిపికి అంతో ఇంతో సినిమా బ్యాక్ గ్రౌండ్ కూడా ఉండటంతో సూపర్ హిట్ సినిమా లెవెల్లోనే భజన పాటలు రాయించుకొని, ట్యూన్ కట్టించుకొని జనాల మీదకి వదులుతున్నారు. అవి చాలా క్యాచీగా ఉండటంతో టిడిపి నేతలు, కార్యకర్తలు, కొంతమంది జనాలు కూడా వాటిని హమ్ చేస్తుంటారు.

ఇక ఈ భజన పాటల ఇస్టోరీ ఇక్కడితో ముగిస్తే కిక్కే రాదు. ఏపిలో చంద్రబాబుని ఎల్లప్పుడూ ఎవరు తలచుకొంటారు అంటే ఆయన భార్యో, కొడుకో. కోడలో, మంత్రులో, మంత్రి పదవులకి, పార్టీ టికెట్ కోసం ఆశపడుతున్నవారో అనుకొంటే చాలా పొరపాటు. ఒకప్పుడు విష్ణుమూర్తిని ఆయన బద్ధ శత్రువు హిరణ్యకశిపుడు పదేపదే తలచుకొన్నట్లుగానే చంద్రబాబు పేరుని, ఆయనని తీవ్రంగా అసహ్యించుకొనే జగన్మోహన్ రెడ్డి తలుచుకొంటుంటారు.                

ఈ విషయంలో ఆయనకి ఎవరూ సాటిరారని ఖచ్చితంగా చెప్పవచ్చు. రాత్రి పగలు, ఎండావానా, ఈ జిల్లా ఆ జిల్లా, ఈ అంశం ఆ అంశం అని చూడకుండా నిత్యం  చంద్రబాబు నామ స్మరణలో జగన్ తరించిపోతుంటారు. ఆయన మాట్లాడే ప్రతీ రెండో పదం చంద్రబాబు పేరే అయ్యుంటుందంటే ఆ లవ్ అర్ధం చేసుకోవచ్చు. అది చూసి చంద్రబాబు ఇంట్లో వాళ్ళు కూడా చాలా అసూయపడుతున్నారని టాక్!  

బాబు మోసగాడు, బాబుని రాళ్ళతో కొట్టాలి..బాబుని చెప్పులతో కొట్టాలి...బాబు అప్పుడు పుట్టి ఉండి ఉంటే అలా చేసేవారు..బాబు ఇప్పుడు ఇలా చేస్తున్నారు... బాబు..అలాగ, బాబు ఇలాగ, బాబు..బాబు.....బాబు...అంటూ చంద్రబాబుపై తన ప్రేమని అదేదో సినిమాలో హీరో “నా ప్రేమని కోపంగానో..నా ప్రేమని ద్వేషంగానో..ఫీల్ మై లవ్” అని పాడిన్నట్లుగానే జగన్ పాడుకొంటున్నారు.

అసలు వైసిపి వాళ్ళకి, టిడిపి వాళ్ళకి ఇంకా ఐడియా రాలేదు గానీ గిన్నీస్ బాబులని పిలించుంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక నిమిషంలో లేదా రోజులో చంద్రబాబు నాయుడు పేరు ఎన్నిసార్లు తలుచుకొంటున్నారో లెక్కపెట్టేసి, జగన్ పేరుని గిన్నీస్ రికార్డులో ఎక్కించేసేవారు.


Related Post