కాశ్మీర్ అల్లర్లకి పాక్ సహకరించి మద్దతు ప్రకటించినప్పటి నుంచి భారత్-పాక్ సంబంధాలు మళ్ళీ మొదటికొచ్చాయి. సరిగ్గా ఈ సమయంలోనే ఇస్లామాబాద్ లో సార్క్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆగస్ట్ 3,4 తేదీలలో జరిగే ఆ సమావేశాలకి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరు కాబోతున్నారు. సాధారణ పరిస్థితులలో అయితే ఆయన పర్యటనకి అంత ప్రాముఖ్యత ఏర్పడేది కాదు. కానీ జమాతే ఇస్లామిక్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థల అధ్వర్యంలో వేలాది మందితో నేడు ఇస్లామాబాద్ లోని భారత ఎంబసిని ముట్టడించడానికి ర్యాలీ మొదలైంది. ఆ తరువాత వారందరితో కలిసి కాశ్మీర్ ని కూడా ముట్టడిస్తామని హిజ్బుల్ సంస్థ అధినేత హఫీజ్ సయీద్ ప్రకటించారు. ఆ కారణంగా భారత్-పాక్ మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇటువంటి సమయంలో భారత హోం మంత్రిని ఇస్లామాబాద్ లో జరిగే సార్క్ సమావేశాలకి వెళ్ళడం బహుశః వ్యూహాత్మకమే కావచ్చు.
ఊహించినట్లుగానే, ఆ ర్యాలీకి నాయకత్వం వహిస్తున్న హిజ్బుల్ అధినేత హఫీజ్ సయీద్, ఆయన పర్యటనని తీవ్రంగా వ్యతిరేకించారు. రాజ్ నాథ్ సింగ్ ని పాకిస్తాన్ లో అడుగుపెట్టనీయవద్దని, తమ హెచ్చరికలని ఖాతరు చేయకుండా ఆయనని పాక్ ప్రభుత్వం ఆహ్వానిస్తే, ప్రభుత్వానికి కూడా గట్టిగా బుద్ధి చెపుతామని హెచ్చరించారు. రాజ్ నాథ్ సింగ్ ని అడ్డుకొంటామని కూడా హెచ్చరించారు.
హిజ్బుల్ ఉగ్రవాద సంస్థ అధినేత చేసిన ఈ హెచ్చరికని పాక్ ప్రభుత్వం తేలికగా తీసుకోలేదు అలాగని దానిని పాటించడం కూడా కష్టమే. బహుశః ప్రధాని నరేంద్ర మోడీ ఆ సంగతి గ్రహించినందునే, రాజ్ నాథ్ సింగ్ ని ఇస్లామాబాద్ పంపిస్తున్నట్లు భావించవచ్చు. ఆయన భద్రతకి పాక్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని భారత విదేశాంగశాఖ పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దీనితో పాక్ ప్రభుత్వం పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది.
సార్క్ లో సభ్యదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనని రావద్దని చెప్పలేదు. ఆయన పాక్ రావడం ఖాయం అయింది కనుక ఆయనని ఆ రెండు ఉగ్రవాద సంస్థల బారి నుండి కాపాడి తిరిగి క్షేమంగా భారత్ చేరుకొనే వరకు పాక్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. భారత రక్షణ మంత్రికి పాక్ లో జరగకూడనిది ఏమైనా జరిగినట్లయితే, అప్పుడు భారత్ ఏ విధంగా స్పందిస్తుందో ఎవరూ ఊహించలేరు. కానీ ఆయనని అనుమతిస్తే పాక్ ప్రభుత్వాన్ని నూకలు చెల్లినట్లేనని హఫీజ్ సయీద్ హెచ్చస్తున్నారు. కనుక రాజ్ నాథ్ సింగ్ పర్యటన పాక్ ప్రభుత్వానికి పెద్ద అగ్ని పరీక్ష వంటిదేనని చెప్పవచ్చు.
కాశ్మీర్ లో చిచ్చుపెట్టడానికి ప్రయత్నించిన పాక్ ప్రభుత్వానికి టిట్-ఫర్-టాట్ అన్నట్లు బుద్ధి చెప్పేందుకే హోం మంత్రిని పంపిస్తున్నట్లు భావించవచ్చు. ఈ సార్క్ సమావేశాలకి ఆయనని పంపడం ద్వారా భారత్ ఏ మాత్రం శ్రమ పడకుండానే పాక్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పబోతోంది. కానీ పాక్ ప్రభుత్వంపై భరోసాతో ఆయనని కరుడుగట్టిన ఉగ్రవాదుల మధ్యకి పంపడం కూడా చాలా ప్రమాదమే కనుక, అత్యవసర పరిస్థితులలో ఆయనకి భద్రత కల్పించి సురక్షితంగా భారత్ తీసుకు వచ్చేందుకు కూడా భారత్ తగిన ఏర్పాట్లు, జాగ్రత్తలు అన్నీ చేసుకొనే ఉందని సమాచారం.