మోడీ ప్రభుత్వం తదుపరి లక్ష్యం అదేనా?

August 16, 2019


img

స్వతంత్ర్య దినోత్సవవేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ గురువారం డిల్లీలోని ఎర్రకోటపై నుంచి దేశప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “దేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. దీనిని తక్షణమే నియంత్రించవలసి ఉంది. లేకుంటే చైనా జనాభాను మించిపోయే ప్రమాదం ఉంది. జనాభా అదుపులో ఉన్నప్పుడే దేశాభివృద్ధి సాధ్యం అవుతుంది. అందరికీ విద్య, వైద్యం, ఉపాది, ఉద్యోగాలు లభిస్తాయి. పిల్లల అవసరాలను తీర్చి వారికి మంచి భవిష్యత్ ఇవ్వగలిగిస్తే స్థితిలో ఉన్నప్పుడే దంపతులు ఒకరు లేదా ఇద్దరు పిల్లలకు పరిమితం అయితే మంచిది. అప్పుడే వారికీ, వారి పిల్లలకు సమాజంలో గౌరవం లభిస్తుంది. పరిమిత సంతానం వలన దేశ జనాభా కూడా నియంత్రణలో ఉంటుంది. జనాభా అదుపులో ఉన్నప్పుడే ప్రతీ ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు గుర్తించి అందుకు అవసరమైన సంస్కరణలను అమలుచేస్తున్నాయి. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్లయితే స్థానికసంస్థల ఎన్నికలో పోటీకి అనర్హులని కొన్ని రాష్ట్రాలు ప్రకటించాయి. ఇటువంటి సంస్కరణలు అవసరం చాలా ఉంది. కానీ ప్రభుత్వం చట్టాలు చేసినంత మాత్రన్న ఇటువంటి సమస్యలను అరికట్టడం సాధ్యం కాదు కనుక ప్రజలందరూ కూడా దేశం గురించి ఆలోచించి స్వచ్ఛందంగా కుటుంబ నియంత్రణకు తద్వారా జనాభా నియంత్రణకు ప్రభుత్వానికి సహకరించాలి. అదే నిజమైన దేశభక్తి అని నేను భావిస్తున్నాను,” అని అన్నారు. 

గతంతో పోలిస్తే ఇప్పుడు దేశంలో ప్రజల ఆలోచనధోరణిలో చాలా మార్పు వచ్చింది కనుక చాలామంది దంపతులు ఒకరు లేదా ఇద్దరు పిల్లలకే పరిమితం అవుతున్నారు. కనుక జనాభా పెరుగుదల కొంత నియంత్రణలోకి వచ్చింది.  కానీ నేటికీ వంశాన్ని ఉద్దరించేందుకో లేదా తలకొరివి పెట్టేందుకో తప్పనిసరిగా మగపిల్లలను కనాలనుకునేవారు కోట్లాదిమంది ఉన్నారు. అలాగే కుటుంబ నియంత్రణ మతాచారానికి విరుద్దమనే కారణంతో పిల్లలను కంటున్నవారు కోట్లాదిమంది ఉన్నారు. నిరక్షరాస్యత, పేదరికం, అవగాహనా రాహిత్యం, వంటి అనేక ఇతర కారణాల చేత పిల్లలను కంటున్నవారు కోట్లాదిమంది ఉన్నారు. ఇటువంటి వారి వలననే దేశజనాభా పెరిగిపోతోంది. వారికి మాటలతో నచ్చజెప్పడం సాధ్యం కాదనే విషయం స్పష్టం అయ్యింది. ట్రిపుల్ తలాక్, కశ్మీర్ వంటి సంక్లిష్టమైన సమస్యల పరిష్కారానికి సాహసోపేతంగా చట్టాలు చేసిన నరేంద్రమోడీ ప్రభుత్వం దీనికి వెనకాడుతుందనుకోలేము. కనుక మోడీ ప్రభుత్వం భవిష్యత్తులో కుటుంబ నియంత్రణకు పార్లమెంటులో కటినమైన చట్టాన్ని ప్రవేశపెట్టినా ఆశ్చర్యం లేదు.


Related Post