తెరాస సర్కార్‌కు ఉచ్చు సిద్దమవుతోందా?

August 14, 2019


img

గత 5 ఏళ్ళలో తెరాస సర్కార్ పట్ల బిజెపి చాలా మెతక వైఖరితో వ్యవహరించింది. కారణాలు అందరికీ తెలుసు. లోక్‌సభ ఎన్నికల తరువాత నుంచి తెరాస పట్ల బిజెపి వైఖరిలో అనూహ్యమైన మార్పు వచ్చింది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకోవడమే బిజెపిలో ఈ మార్పుకి కారణం. కనుక ఇప్పుడు రాష్ట్రంలో తలెత్తుతున్న ప్రతీ సమస్య కేంద్రం దృష్టికి వెళుతోంది...వాటిపై కేంద్రం వెంటనే స్పందిస్తోంది. అంటే తెరాస సర్కారుకు ఉచ్చు సిద్దం చేస్తున్నట్లుగానే భావించవచ్చు.

రాష్ట్రంలో 26 మంది ఇంటర్మీడియెట్ విద్యార్దుల ఆత్మహత్యలు చేసుకోవడం గురించి బిజెపి ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తిన సంగతి తెలిసిందే. రాష్ట్ర బిజెపి నేతలు, ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి దీనిపై ఫిర్యాదు కూడా చేశారు. సాధారణంగా ప్రతిపక్షాలు చేసే ఇటువంటి పిర్యాదులను, వినతిపత్రాలను గవర్నర్లు, రాష్ట్రపతి పెద్దగా పట్టించుకోరనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ తెరాస పట్ల బిజెపి వైఖరిలో మార్పును సూచిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వారి ఫిర్యాదుపై స్పందించారు. ఇంటర్ విద్యార్దుల ఆత్మహత్యల గురించి నివేదిక ఇవ్వాలని రాష్ట్రపతి కేంద్రహోంశాఖను కోరగా అది రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి ఎస్.కె.జోషిని నివేదిక పంపించాల్సిందిగా కోరుతూ ఆగస్ట్ 7వ తేదీన లేఖ వ్రాసింది. 

ఇంటర్ ఫలితాలలో గందరగోళం, విద్యార్దుల ఆత్మహత్యలు, పరీక్షాపత్రాలను పునఃపరిశీలించి మళ్ళీ ఫలితాలు ప్రకటించడం, మంత్రుల కమిటీ అధ్యయనంతో ఈ కధ ముగిసిపోయిందనుకుంటే, కేంద్రం వివరణ కోరడంతో కధ మళ్ళీ మొదటికొచ్చినట్లయింది. ఈ గందరగోళానికి బాధ్యులపై ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుందో, ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా మంత్రుల కమిటీ ఏమి సిఫార్సులు చేసిందో, ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుందో తెలియదు. కనుక ఈ వ్యవహారంలో కేంద్రం వేలుపెట్టగలుగుతోంది.


Related Post