పాకిస్థాన్‌ కుప్పిగంతులు

August 10, 2019


img

కశ్మీర్‌పై భారత్‌ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలపై తీవ్ర ఉక్రోషంతో మండిపడుతున్న పాకిస్థాన్‌ ప్రభుత్వం చేపడుతున్న ప్రతీకారచర్యలు కోతి కుప్పిగంతులను తలపిస్తున్నాయి. భారత్‌-పాక్‌ మద్య నడిచే సంజౌతా, థార్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసిన పాక్‌, తాజాగా లాహోర్-డిల్లీ మద్య నడుస్తున్న బస్సు సర్వీసులను కూడా రద్దు చేసినట్లు ప్రకటించింది. భద్రతాకారణాల చేతనే ట్రైన్, బహిరంగసభ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు పాక్‌ చెప్పుకొంటున్నప్పటికీ, భారత్‌పై అక్కసుతోనే నిలిపివేసిందని అర్ధమవుతూనే ఉంది. 

భారత్‌ నిర్ణయాలను ఖండించాలనే పాక్‌ ప్రభుత్వ అభ్యర్ధనలను చైనా, అమెరికా, ఐక్యరాజ్యసమితి తిరస్కరించడంతో పాక్‌ అంతర్జాతీయ సమాజంలో మరోసారి ఒంటరయ్యింది. చివరికి తాలిబాన్ ఉగ్రవాదులు కూడా ‘బుద్దిగా మసులుకోమని’ పాక్‌ ప్రభుత్వానికే గడ్డి పెట్టడం విశేషం. 

పాక్‌ చర్యల వలన ఆ దేశం నవ్వులపాలవుతుండటమే కాక తీవ్రంగా నష్టపోతుందని భారత్‌తో సహా వివిద దేశాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికైనా పాక్‌ తన నిర్ణయాలను పునః సమీక్షించుకుంటే మంచిదని భారత్‌ సూచించింది. కానీ పాకిస్థాన్‌ స్థితిగతులను సమూలంగా మార్చివేసి నయా పాకిస్థాన్‌ను ఆవిష్కరిస్తానని ప్రగల్భాలు పలికిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ కూడా గత పాలకుల బాటలోనే నడుస్తూ భారత్‌పై విద్వేషం కక్కుతున్నారు. మళ్ళీ పుల్వామా తరహా దాడులు జరిగే అవకాశం ఉందని, అప్పుడు భారత్‌-పాక్‌ మద్య ప్రత్యక్షయుద్ధం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. 

భారత్‌ కంటే కొన్ని గంటల ముందు స్వాతంత్రం పొందిన పాకిస్థాన్‌ ఈ 70 ఏళ్ళలో ఒక ఉగ్రవాదదేశంగా మారితే, దాని కంటే వెనుక స్వాతంత్రం పొందిన భారత్‌ అగ్రరాజ్యాలతో పోటీపడుతూ అభివృద్ధి చెందిన దేశంగా నిలిచింది. కనుక శాంతి, అభివృద్ధిపధంలో పయనిస్తున్న భారత్‌ వైపు ప్రపంచదేశాలు మొగ్గుచూపడం, పాకిస్థాన్‌ను ఒక ధూర్త దేశంగా భావించడం సహజం. అయితే నేటికీ పాక్‌ పాలకులు ఇంత చిన్న విషయాన్ని గ్రహించినట్లు లేదు.


Related Post