వివేక్ అప్పుడే మొదలెట్టేశారు

August 09, 2019


img

మొదట కాంగ్రెస్‌.. తరువాత  తెరాస…ఇప్పుడు బిజెపిలో చేరిన మాజీ ఎంపీ గడ్డం వివేక్ పదవుల కోసమే పార్టీలు మారుతారనే జానాభిప్రాయం నిజమేనని దృవీకరిస్తున్నట్లు మాట్లాడారు. ఈరోజు బిజెపిలో చేరిన వెంటనే ఆయన సిఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తూ, “నాకు ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పి కేసీఆర్‌ మాట తప్పారు. మాట తప్పడం ఆయనకు అలవాటే. ఆయనకు ఉద్యమకారులంటే భయం. అందుకే వారిని ఒకరొకరిగా బయటకు పంపించేస్తుంటారు. నిరంకుశ పాలన సాగిస్తున్న ఆయనను గద్దె దించి రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతమైన బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తాను,” అని అన్నారు. 

వివేక్‌కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు.      

ఎంపీ టికెట్ లభిస్తుందనే హామీతోనే వివేక్ తెరాసలో చేరినట్లు ఆయన మాటలలోనే స్పష్టం అవుతోంది. కానీ టికెట్ లభించకపోవడంతో తెరాసను వీడి ‘సముచిత స్థానం’ హామీతో ఇప్పుడు బిజెపిలో చేరినట్లు కె.లక్ష్మణ్‌ మాటలతో స్పష్టం అవుతోంది. ఒకవేళ కేసీఆర్‌ ఆయనకు టికెట్ ఇచ్చి ఉండి ఉంటే, కేసీఆర్‌ ప్రభుత్వాన్ని వెనకేసుకువస్తూ వివేక్ పార్లమెంటులో బిజెపితో  పోరాడుతుండేవారని వేరే చెప్పనవసరం లేదు. ఒకవేళ రేపు బిజెపి కూడా ఆయనకు ‘సముచిత స్థానం’ ఇవ్వకపోతే అప్పుడు బిజెపిని వీడి మళ్ళీ కాంగ్రెస్‌ గూటికి చేరినా ఆశ్చర్యం లేదు. 

ఒకప్పుడు అన్ని రాజకీయ పార్టీలలో కార్యకర్తల స్థాయి నుంచి పనిచేస్తూ నాయకులుగా ఎదిగేవారు కనుక వారికి పార్టీతో ధృడమైన అనుబందం ఉండేది. అలాగే దిగువస్థాయి నుంచి ఎదిగిన అటువంటి నాయకుల వలన పార్టీ పునాదులు చాలా బలంగా ఉండేవి. కానీ ఇప్పుడు వ్యాపారాలు, కాంట్రాక్టులు, విద్యావ్యాపారాలు చేసుకొని పుష్కలంగా డబ్బు గడించినవారు రాజకీయాలలోకి వస్తుండటంతో వారికి పార్టీలతో ఎటువంటి ‘అటాచ్ మెంట్’ ఉండటం లేదు. వారు పదవులు అధికారమే ముఖ్యంగా భావిస్తూ పార్టీలు మారుతుండటం సర్వసాధారణమైపోయింది. అటువంటి అవకాశవాద నేతలను చేర్చుకొని ‘పార్టీ బలోపేతం’ అయ్యిందని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది.


Related Post