అతివిశ్వాసమే కొంప ముంచింది: కేటీఆర్‌

August 08, 2019


img

తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బుదవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బూత్ స్థాయి కమిటీ సభ్యులతో సమావేశమైనప్పుడు మాట్లాడుతూ, “రాష్ట్రంలో తెరాస చాలా బలంగా ఉందనే అతివిశ్వాసంతో వ్యవహరించడం వలననే లోక్‌సభ ఎన్నికలలో కరీంనగర్‌లో తెరాస ఓడిపోయింది. ఒక మంచి నేతను లోక్‌సభకు పంపించే అవకాశం కోల్పోయాము. అసెంబ్లీ ఎన్నికలలో కరీంనగర్‌లో మనకు  బారీ మెజార్టీ వచ్చింది. అందులో సగం ఓట్లు మన అభ్యర్ధికి పడిన ఘనవిజయం సాధించి ఉండేవారు. కనుక ఈ ఓటమిని గుణపాఠంగా భావించి అందరూ కలిసికట్టుగా పనిచేసి మున్సిపల్ ఎన్నికలలో మన అభ్యర్ధులను గెలిపించుకోవాలి. ప్రభుత్వం అందిస్తున్న కేసీఆర్‌ కిట్స్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లతో లబ్ధి పొందింవారు కొన్ని లక్షల మంది ఉన్నారు.  రాష్ట్రంలో ఏ ఇంటి తలుపు తట్టినా ఏదో ఒక సంక్షేమ పధకం పొందినవారే ఉన్నారు కనుక మన ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలు కూడా గుర్తిస్తారనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కేంద్రప్రభుత్వం కంటే మన రాష్ట్ర ప్రభుత్వమే సంక్షేమ పధకాలపై ఎక్కువ ఖర్చు చేస్తోంది. రాష్ట్రం ఆదాయం పెంచి దానిని ప్రజలకు పంచాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తోంది. బతుకమ్మ చీరల తయారీతో సిరిసిల్లలో చేనేత కార్మికుల జీవితాలలో వెలుగులు నింపుతున్నాము. వారే మన ప్రభుత్వానికి పెద్ద బ్రాండ్ అంబాసిడర్లు.  అయినప్పటికీ మనం ప్రజల మద్యనే ఉంటూ వారికి ప్రభుత్వ పధకాల గురించి వివరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలి. ప్రభుత్వానికి, ప్రజలను మద్య పార్టీ కార్యకర్తలు వారధి వంటివారు. కనుక పార్టీ జయాపజయాలు కార్యకర్తల పనితీరుపైనే ఆధారపడి ఉంటాయి. మున్సిపల్ ఎన్నికలలో పార్టీని గెలిపించుకునేందుకు అందరూ కష్టపడి పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.  

లోక్‌సభ ఎన్నికలలో తెరాస ఓటమికి అతివిశ్వాసమే కారణమన్న కేటీఆర్‌ మాటలు నూటికి నూరు శాతం నిజం. ఒక్క కరీంనగర్‌లోనే కాక నిజామాబాద్‌కు ఇది వర్తిస్తుంది. లోక్‌సభ ఎన్నికలకు మునుపు రెండు మూడు నెలల నుంచి జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతులు గిట్టుబాటు ధరకోసం ఆందోళనలు చేస్తుంటే కవిత, కేటీఆర్‌ వాటిని తేలికగా తీసుకున్నారు. రైతుల వెనుక కాంగ్రెస్‌, బిజెపిలున్నాయని ఆరోపించారు. మరి ఆ విషయం తెరాస గ్రహించినప్పటికీ, ‘సిఎం కేసీఆర్‌ కుమార్తె కవిత నిలబడితే ఆమెను ఓడించే మొనగాడు ఎవ్వరు?’ అన్నట్లు అతివిశ్వాసంగా వ్యవహరించారు. అదే ఆమె ఓటమికి కారణం అయ్యింది. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధినేతలు వారిని ‘టేకెన్ ఫర్ గ్రాంటెడ్’ గా తీసుకోకూడదని ఈ ఈ ఓటములు స్పష్టం చేస్తున్నాయి. కేటీఆర్‌ కూడా అదే చెపుతున్నారు.          



Related Post