అమిత్ షా తలుచుకుంటే తెలంగాణలో అధికారం మాదే!

August 07, 2019


img

లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి తిరుగులేని విజయం సాధించడం, కమ్యూనిస్టులు-తృణమూల్ కంచుకోట పశ్చిమబెంగాల్లో బిజెపి 18 ఎంపీ సీట్లు గెలుచుకోవడం, తాజాగా ట్రిపుల్‌ తలాక్‌, కశ్మీర్ బిల్లులను పార్లమెంటు చేత ఆమోదముద్ర వేయించుకోవడంవంటివన్నీ కేంద్రహోంమంత్రి అమిత్ షా శక్తిసామర్ధ్యాలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అందుకే అమిత్ షా తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం కూడా సాధ్యమేనని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. 

బుదవారం హైదరాబాద్‌ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రహోంమంత్రి అమిత్ షా తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని ఇప్పటికే పలుమార్లు నిరూపితమైంది. కనుక ఆయన దృష్టి పెడితే తెలంగాణలో కూడా మేము అధికారంలోకి రాగలము. వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రంలో 50 శాతం ఓటుబ్యాంకును ఏర్పరచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తాము. వచ్చే ఎన్నికలలో తప్పకుండా గెలిచి రాష్ట్రంలో అధికారం చేపడతాము. అప్పుడు గోల్కొండ కోటపై అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తాము. ట్రిపుల్‌ తలాక్‌, కశ్మీర్ బిల్లులకు మద్దతు ఇవ్వకుంటే ప్రజలలో చులకనవుతామనే భయంతోనే తెరాస మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోనే బిజెపి చేరుతారు,” అని అన్నారు.

కేంద్రహోంమంత్రి అమిత్ షా శక్తి సామర్ధ్యాల గురించి కె. లక్ష్మణ్ చెప్పినది వాస్తవమే కానీ తెరాసకు గత్యంతరం లేకనే కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు ఇచ్చిందనేది సరికాదు. లక్ష్మణ్ మాటలు ‘ఏరు దాటనంత వరకు ఓడ మల్లన్న... దాటేక బోడి మల్లన్న’ అన్నట్లున్నాయి. కీలకమైన బిల్లుల ఆమోదానికి సహకరించిన ప్రతిపక్షాల పట్ల గౌరవం, కృతజ్ఞత ప్రదర్శించకపోయినా పరువాలేదు కానీ ఈవిధంగా మాట్లాడటం సరికాదు. తెలంగాణలో బిజెపి అధికారంలో రావాలనుకోవడంలో తప్పులేదు కానీ త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలలో తమ సత్తా ఏపాటిదో నిరూపించుకోవాలి లేకుంటే రాష్ట్రంలో 4 ఎంపీ సీట్లు 'పొరపాటున' గెలుచుకొందనే కాంగ్రెస్‌, తెరాస వాదనలకు బలం చేకూరుతుందని గ్రహిస్తే మంచిది. 


Related Post