ప్రతిపక్షాలకు అమిత్ షా సూటి ప్రశ్నలు... సమాధానాలు

August 06, 2019


img

జమ్ముకశ్మీర్‌ పునర్విభజన బిల్లు, ఆర్టికల్ 370 రద్దు బిల్లులపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కేంద్రహోంమంత్రి అమిత్ షా ఈరోజు లోక్‌సభలో చాలా చక్కగా సమాధానాలు ఇచ్చారు.

“ఆర్టికల్ 370ని రద్దు చేసి మేము చాలా చారిత్రిక తప్పిదం చేశామని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. కానీ 70 ఏళ్ల క్రితం జరిగిన ఒక చారిత్రిక తప్పిదాన్ని మేము ధైర్యంగా సరిదిద్దామని ఆయన తెలుసుకుంటే మంచిది. గత 70 ఏళ్ళలో వేలాదిమంది కాశ్మీరీలు, మన జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ మార్గంలో ప్రయాణించడం వలన మేలు కంటే కీడే జరుగుతోందని తెలిసినప్పుడు ఇంకా ఆదేమార్గంలో గుడ్డిగా ముందుకు సాగుతూ నష్టపోవాలా? లేక ఈ సమస్యలకు పరిష్కార మార్గాలు వెతకడం మంచిదా?మేము అటువంటి ప్రయత్నమే చేస్తే హర్షించవలసిన ప్రతిపక్షాలు మనకు నష్టం కలిగిస్తున్న అదే మార్గంలో ఇంకా ఎందుకు పయనించాలని కోరుకొంటున్నాయో నాకు తెలియదు. 

ఆర్టికల్ 370పై ఉభయసభలలో జరిగిన చర్చలను నేను చాలా జాగ్రత్తగా విన్నాను. చాలా మంది సభ్యులు దానిని కొనసాగించాలని కోరుతున్నారు. కానీ దాని వలన దేశానికి, కశ్మీర్ ప్రజలకు ఏమి మేలు కలుగుతుందో ఎవరూ చెప్పలేకపోయారు. కానీ నేను ఆర్టికల్ 370ని కొనసాగించడం వలన జమ్ముకశ్మీర్‌ ప్రజలు ఎంత నష్టపోతున్నారో చెప్పగలను. దానిని తొలగించడం వలన వారికి ఏమేమి ప్రయోజనాలు కలుగుతాయో నేను వివరించగలను.

దేశంలో అన్ని రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతుంటే ఒక్క జమ్ముకశ్మీర్‌ మాత్రం ఈ ఆర్టికల్ 370 కారణంగా ఏమాత్రం అభివృద్ధి చెందకుండా అలాగే నిలిచిపోయింది. దేశంలో అన్ని రాష్ట్రాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు, పిల్లలు, మహిళలు, విద్యార్దులు, వృద్ధులు అందరికీ సంక్షేమ పధకాలో, అభివృద్ధి ఫలాలో అందుతున్నాయి. కానీ ఈ ఆర్టికల్ 370 కారణంగా జమ్ముకశ్మీర్‌లోని ప్రజలకు అవేవీ అందడం లేదు. ఆర్టికల్ 370ని అడ్డం పెట్టుకొని జమ్ముకశ్మీర్‌లో కేవలం ఓ మూడు కుటుంబాలు మాత్రమే అన్నీ అనుభవిస్తున్నాయి. 

మేము జమ్ముకశ్మీర్‌ను దేశం నుంచి విడదీస్తున్నామని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆర్టికల్ 370ని రద్దు చేసి భారత రాజ్యాంగం, చట్టాలు అక్కడ అమలయ్యేలా చేయడం ద్వారా మేము జమ్ముకశ్మీర్‌ను దేశంతో జోడించేందుకు ప్రయత్నిస్తున్నామని, జమ్ము కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని ప్రపంచానికి చాటిచెప్పుతున్నామని ప్రతిపక్షాలు గ్రహిస్తే మంచిది. 

జమ్ముకశ్మీర్‌, లడ్డాక్ కేంద్రపాలిత ప్రాంతాలను అక్కడి ప్రజలను యావత్ దేశంతో, దేశప్రజలతో జోడించడం ద్వారా మనమంతా ఒకటేననే భావన వారిలో కల్పించి, జమ్ముకశ్మీర్‌కు కూడా  దేశంలో మిగిలిన రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే అవకాశాలు కల్పిస్తున్నామని ప్రతిపక్ష సభ్యులు గ్రహిస్తే మాపై ఇటువంటి ఆరోపణలు చేయరు. 

దేశంలో ప్రజలందరికీ ఉండే హక్కులు, అందుతున్న సౌకర్యాలు, విద్యా, వైద్యం తదితర అభివృద్ధి, సంక్షేమ ఫలాలు జమ్ముకశ్మీర్‌ ప్రజలకు దక్కకూడదని ప్రతిపక్షాలు భావిస్తున్నాయా? ఈ అన్యాయాన్ని, వివక్షను సరిదిద్దడానికే మేము ఆర్టికల్ 370ని రద్దు చేశాము తప్ప ఏదో రాజకీయ ప్రయోజనాలు ఆశించికాదు. రాబోయే 5 ఏళ్ళలో జమ్ముకశ్మీర్‌, మరియు లడ్డాక్ లను ఏవిధంగా అభివృద్ధి చేస్తామో మీరే చూద్దురు గాని. మళ్ళీ జమ్ముకశ్మీర్‌కు పూర్వవైభవం కల్పించి చూపిస్తాము. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు శాంతియుత వాతావరణం వచ్చేస్తుందని మేము చెప్పడం లేదు కానీ త్వరలోనే తప్పకుండా ఆ రోజు వస్తుందని గట్టిగా చెప్పగలను. అప్పుడు ఇవే ప్రతిపక్షాలు మా నిర్ణయం సరైనదని అంగీకరిస్తాయి,” అని అన్నారు.


Related Post