అక్బరుద్దీన్ బుక్‌ అయ్యారు కానీ...

August 02, 2019


img

మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి క్లీన్ చిట్ ఇచ్చిన కరీంనగర్‌ పోలీసు కమీషనర్ కమల్ హాసన్ రెడ్డే హైకోర్టు ఆదేశానుసారం ఓవైసీపై కేసు నమోదు చేయవలసి వచ్చింది. ఇటీవల కరీంనగర్‌లో ఒక సభలో అక్బరుద్దీన్ మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారు. దానిపై బిజెపి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసు కమీషనర్ కమల్‌ హాసన్ రెడ్డి అక్బరుద్దీన్ ఓవైసీను వెనకేసుకు వస్తునట్లు మాట్లాడారు. ఆయన ప్రసంగం ప్రజలను రెచ్చగొట్టేవిధంగా లేదని క్లీన్ చిట్ ఇచ్చారు.

ఇది బిజెపి నేతలకు కోర్టు మెట్లు ఎక్కేందుకు అవకాశం కల్పించినట్లయింది. ప్రజల మద్య మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగిస్తే, తాము ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఆయనపై ఎటువంటి చర్య తీసుకోలేదని కరీంనగర్‌ బిజెపి అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధి అయిన అక్బరుద్దీన్ ఈవిధంగా వ్యవహరించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవలసిందిగా హైకోర్టును అభ్యర్ధించారు. ఆయన పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం అక్బరుద్దీన్ ఓవైసీపై సెక్షన్స్ 153-ఏ, 153-బి, 506, స్సీ ఆర్పీసీ156(3) క్రింద కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించడంతో కరీంనగర్‌ 3వ పట్టణం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. 

రాజకీయ పార్టీలు ఎన్నికలలో పోటీ చేయాలనుకొన్నప్పుడు ఇంతవరకు తమ పార్టీ ప్రజల కోసం ఏమి చేసిందో, ఎన్నికలలో గెలిస్తే ఏమి చేయబోతోందో వివరించి ఓట్లు అడగవచ్చు. కానీ ఆవిధంగా ప్రజలను మెప్పించడం చాలా కష్టం. కనుక భావోద్వేగాలు రెచ్చగొట్టడం ద్వారా సులువుగా ఓట్లు సంపాదించుకోవాలని అక్బరుద్దీన్ ఓవైసీవంటి రాజకీయ నాయకులు ప్రయత్నిస్తుంటారు. అటువంటి ప్రయత్నాలను వారి ప్రత్యర్ధులు కంటే ముందుగా ప్రజలే తిప్పికొడుతుంటే, ఓవైసీవంటి నేతలు మళ్ళీ అటువంటి ప్రయత్నాలు చేయరు. కానీ దురదృష్టవశాత్తు చాలామంది భావోద్వేగాలకే ప్రాధాన్యం ఇస్తుంటారు కనుకనే రాజకీయ నాయకులు కూడా వారి బలహీనతలతో ఆడుకొంటుంటారు. 

ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు అయినప్పటికీ, దాని వలన మజ్లీస్ పార్టీకి నష్టం కంటే లాభమే కలిగించవచ్చు. మున్సిపల్ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పరిణామాలు మజ్లీస్ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది.


Related Post